ఏకకాలంలో 32 మందితో వాట్సాప్ వీడియోకాల్

ఏకకాలంలో 32 మందితో వాట్సాప్ వీడియోకాల్

వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్లు ఒక్కటొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈక్రమంలోనే మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ ను టెస్టింగ్ చేసే ప్రక్రియను త్వరలోనే వాట్సాప్ ప్రారంభించనుంది. దాని పేరే ‘కాల్ లింక్స్’. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫీచర్ ను ఉపయోగించి ఒక లింక్ ను గరిష్ఠంగా 32 మందికి షేర్ చేసి.. దాని ద్వారా ఏకకాలంలో 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు. వాట్సాప్ లో లేని వారు కూడా ఈ లింక్ ద్వారా వీడియో కాల్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మెటా (ఫేస్ బుక్) గ్రూప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా దీనిపై ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ఈ వారంలోనే ‘కాల్ లింక్స్’ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.  అయితే ఈ ఫీచర్ ను వాడాలంటే వాట్సాప్ కొత్త వర్షన్ కు అప్ డేట్ కావాల్సి ఉంటుంది. ఈ తరహాలో గ్రూప్ వీడియో కాల్ లింక్ ను షేర్ చేసే ఫీచర్ గూగుల్ మీట్, జూమ్ యాప్ లలో అందుబాటులో ఉంది. 

వాట్సాప్ లోని  ‘కాల్స్’ ట్యాబ్ లోకి వెళ్లాక ‘కాల్ లింక్స్’ అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆడియో లేదా వీడియో కాల్ కు సంబంధించిన లింక్ ను క్రియేట్ చేయొచ్చు.  ఆ లింక్ ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ద్వారా వారిని గ్రూప్ వీడియో కాల్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్ లిస్టులో లేని వారి నంబర్లకు కూడా ఈ లింక్ ను షేర్ చేయొచ్చు. ఆ లింక్ ను క్లిక్ చేసి వాళ్లు కూడా గ్రూప్ కాల్ లో చేరొచ్చు. ఇలా గరిష్ఠంగా 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడేందుకు ‘కాల్ లింక్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న వాట్సాప్ గ్రూప్ కాల్ ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 8 మందితోనే మాట్లాడే అవకాశం ఉంది.