
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ “క్యాప్షన్ ఫీచర్‌తో ఫార్వార్డ్ మీడియాను” త్వరలోనే తీసుకురానున్నట్టు ఇటీవలే ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉందని ఒక నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ వినియోగదారులను క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేస్తుంది. WABetaInfo సమాచారం ప్రకారం వాట్సాప్ వినియోగదారులకు ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదేంటంటే వాట్సాప్ లో GIFలు, వీడియోలు లాంటి ఇతర మీడియా ఫైల్స్ ను సెండ్ చేసేటప్పుడు ఇకనుంచి క్యాప్షన్ ను కూడా జత చేయవచ్చు. దీని వల్ల ఫైల్స్ ను క్యాప్షన్ తో ఈజీగా సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా ఆ మెసేజ్ ను ఫార్వార్డ్ చేయకూడదని భావిస్తే.. దాన్ని ఫార్వార్డ్ చేసే ముందు ఫైల్ నుండి క్యాప్షన్‌ను తొలగించడానికి డిస్మిస్ బటన్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ ఫీచర్ ముందుగా ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులోకి రాగా.. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా వినియోగించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా వాట్సాప్ ఇప్పటికే రిలీజ్ చేసింది. రోజుకో కొత్త అప్ డేట్ తో కస్టమర్స్ ను ఆకర్షిస్తున్న మెటా.. వాట్సాప్ లో ఇప్పటికే చాలా ఫీచర్లు తీసుకొచ్చింది. గత కొన్ని రోజుల క్రితమే డిలీట్ అయిన మెసేజ్ సైతం తాత్కాలికంగా సేవ్ అయ్యే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం రిపోర్ట్ స్టేటస్ అపడేట్ ఫంక్షన్ పై పని చేస్తోంది. ఇది త్వరలోనే వాట్సాప్ లోని స్టేటస్ సెట్టింగ్ లలో చేరనున్నట్టు సమాచారం.