వాట్సాప్​ డిలీట్​ ఆప్షన్​లో తిరకాసులు

వాట్సాప్​ డిలీట్​ ఆప్షన్​లో తిరకాసులు

డిలీట్​ అయిందనుకుంటే పొరపాటే

ఒకళ్లకు పంపాల్సిన మెసేజ్​ ఇంకొకళ్లకు పోయింది. ఏం చేస్తారు..? ‘డిలీట్​ ఫర్​ ఎవ్రీ వన్​’ అనే ఆప్షన్​ ఉందిగా.. అదే చేస్తామన్న ఆన్సర్​ చాలా మంది నుంచి వస్తుంది. కానీ, మీకో షాకింగ్​ విషయం తెలుసా..? అన్ని సందర్భాల్లోనూ ఆ మెసేజ్​ డిలీట్​ అయిపోతుందనుకుంటే పొరపాటే. అవును, ఈ విషయాన్ని ఎఫ్​ఏక్యూ పేజీలో స్పెషల్​ నోట్​గా వెల్లడించింది వాట్సాప్​. ఏయే సందర్భాల్లో ఆ ఆప్షన్​ ఫెయిలయ్యే చాన్స్​ ఉందో వివరించింది.

అవతలి వాళ్లూ అప్​డేట్​ కావాల్సిందే

డిలీట్​ ఆప్షన్​ను వాడుకోవాలంటే మీతోపాటు అవతలి వాళ్ల వాట్సాప్​ లేటెస్ట్​ వెర్షన్​ అయి ఉండాలి. ఆండ్రాయిడ్​, ఐవోఎస్​లైనా పంపేవాళ్లది, ఆ మెసేజ్​ను రిసీవ్​ చేసుకున్న వాళ్ల వాట్సాప్​ లేటెస్ట్​ వెర్షన్​లో ఉండాలి. లేదంటే మనం డిలీట్​ చేసినా, అవతలి వాళ్ల ఫోన్​లో డిలీట్​ అయ్యే చాన్స్​ లేదు.

ఐవోఎస్​ అయితే.. డిలీట్​ అయినా ఉంటది

ఐఫోన్​ వాడేవాళ్ల వాట్సాప్​కు మెసేజ్​లుగానీ, ఫొటోలు గానీ పంపితే, ఆ ఫొటోలు వాళ్లవాళ్ల ఫోన్లలో సేవ్​ అయ్యే చాన్స్​ ఉంటుంది. వాట్సాప్​ చాట్​ నుంచి ఆ ఫొటోలను డిలీట్​ చేసినా, ఫొటో యాప్​లోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. యాపిల్​ సంస్థ పెట్టుకున్న ప్రైవసీ పాలసీనే కారణం.

డిలీట్​ చేసేటప్పుడే అవతలోళ్లు చూసేయొచ్చు

పంపిన మెసేజ్​ను డిలీట్​ చేయాలనుకున్నలోపే అవతలోళ్లు దాన్ని చూసే అవకాశం లేకపోలేదు. ఆ మెసేజ్​ రిసీవ్​ చేసుకున్న వ్యక్తి చాట్​లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

సక్సెస్​ కాకపోతే అంతే..

మనం మెసేజ్​ డిలీట్​ చేసినప్పుడు ఒక్కోసారి అది ఫెయిల్​ అయ్యే చాన్స్​ ఉంది. కానీ, మనకు నోటిఫికేషన్​ కూడా రాదు. ఇలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తి మనం పంపిన మెసేజ్​ను చూసే చాన్సెస్​ చాలా ఎక్కువ. పంపిన మెసేజ్​ను డిలీట్​ చేయడానికి ఉండే టైం గంటా 8 నిమిషాల 16 సెకన్లు. ఆ లోపలే మెసేజ్​ను డిలీట్​ చేసేయాలి.