భారత్లో మెటాకు ఎదురుదెబ్బ.. ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్ రిజైన్

భారత్లో మెటాకు ఎదురుదెబ్బ.. ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్ రిజైన్

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు భారత్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అనుబంధ సంస్థ వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. మెటా ఇండియా కంట్రీ హెడ్ అజిత్ మోహన్ తప్పుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. వాట్సాప్ ఇతర దేశాల్లో నియమించిన మొట్టమొదటి కంట్రీ హెడ్ అభిజిత్ బోస్ కావడం విశేషం. 2018లో వాట్సాప్ ఆయనను హెడ్‌గా నియమించింది. వాట్సాప్ పేమెంట్ బిజినెస్ డెవలప్మెంట్ సహా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారంను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అభిజిత్ బోస్ ఎంతో కృషి చేశారు. బోస్ గతంలో ఈజీట్యాప్ కో ఫౌండర్గా పనిచేశారు.

మెటా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందిని తొలగించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే వాట్సాప్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామాకు తాజా పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని మెటా స్పష్టం చేసింది. బోస్ నోటీస్ పీరియడ్ ఈ వారంలోనే ముగియనుండగా.. అగర్వాల్ మరికొన్నాళ్లు వర్క్ చేయనున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లింక్డ్ ఇన్లో తన రాజీనామాను ప్రకటించిన బోస్.. చిన్న బ్రేక్ తర్వాత కొత్త జాబ్లో చేరేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని పోస్ట్ చేశారు.