వాట్సాప్ లో చిచ్చు పెట్టే పోస్టులు : 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష

వాట్సాప్ లో చిచ్చు పెట్టే పోస్టులు : 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష

ఇప్పుడంతా వాట్సప్ కాలం నడుస్తోంది. ఫోటోలు, వీడియోలు, గ్రూపులు కట్టడం, ఇలా ఒక్కటేమిటి అన్నీ ఒకచోటే. పిల్లలు కూడా వాట్సప్ చాటింగులు, వీడియోలు పంపుకోవడం చేస్తున్నారు. అంతా వేళ్ల మీద పని అయింది. స్కూల్ పిల్లల దగ్గర్నుంచి ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థల దాకా అంతా వాట్సప్ గ్రూపులతోనే పని ఉంటోంది. కాలేజీలు, బస్ స్టాప్ లు, కార్పోరేట్ కంపనీల్లో దొంగచాటుగా యువతులు, విద్యార్ధినుల ఫోటోలు, వీడియోలు తీస్తున్న పోకిరీలు…వాటిని వాట్సాప్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఇలా కొందరు ఆకతాయిలు.. అమ్మాయిలను వేధిస్తుంటే…మరికొందరు ప్రేమ పేరుతో బెదిరిస్తూ వాట్సాప్ ను మిస్ యూజ్ చేస్తున్నారు.

కొందరు వాట్సప్ యూజర్లు ఫోటోలు మార్పింగ్ చేసిన ఫోటోలు పెట్టి.. ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగిస్తే అది కూడా నేరమే అంటున్నారు పోలీసులు. యువతుల వాట్సాప్ నెంబర్లు తీసుకొని చాటింగ్ చేసి… వారిని ట్రాప్ లోకి లాగుతున్నారు కొందరు పోకిరీలు. వాట్సాప్ లో చాటింగ్ చేసిన విధానం ఆధారంగా ఎవరైనా మహిళలు కంప్లయింట్ చేస్తే చర్యలు తీసుకొని జైలుకు పంపుతున్నారు పోలీసులు.

అటు సైబర్ నేరగాళ్లు కూడా వాట్సాప్ లింక్ ల ద్వారా మనకి తెలియకుండానే గ్రూపుల్లోకి ఎంటర్ అవుతున్నారు.  చాటింగ్ లు, వీడియో కాల్స్ చేస్తూ మాయమాటలు చేప్పి యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. గిఫ్ట్ పంపుతున్నామని… ఎయిర్ పోర్ట్ లో క్లియరెన్స్ పేరుతో లక్షలు కొట్టేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్  నేరగాళ్లు వాట్సాప్  లో బ్యాంక్ ఖాతాదారులను కూడా సంప్రదిస్తున్నారు. తక్కువ వడ్డీకే రుణం ఇస్తామంటూ డెబిట్, క్రెడిట్ కార్ట్ వివరాలు తెలుసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.

ఈమధ్య వాట్సాప్ పేరుతో ఫేక్ యాప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్ తెచ్చిందనీ… ఈ లింక్ క్లిక్ చేసి ఇన్  స్టాల్ చేసుకుంటే మీ యాప్ గోల్డ్ కలర్ లోకి మారుతుందని చెప్పి ట్రాప్ చేస్తున్నారు. అది నిజంగా వాట్సప్ రూపొందించిన కొత్త యాప్ అని నమ్మిస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి ఆ లింక్ క్లిక్ చేసి కొత్త యాప్ ఇన్ స్టాల్ చేసి… వాట్సప్ గోల్డ్ కలర్ లోకి మారిందని మురిసిపోతున్నారు. కానీ అది నిజమైన యాప్ కాదు. భయంకరమైన వైరస్. అది ఇన్  స్టాల్ చేశారంటే అడ్డంగా బుక్కైనట్టే అంటున్నారు పోలీసులు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేస్తే వైరస్ ఎటాక్ అయి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల కు చేరిపోతుంది.

వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా అసభ్యకరమైన పోస్ట్ లు చేస్తే దానికి అడ్మీనే భాద్యత వహించవలసి ఉంటుంది అంటున్నారు పోలీసులు. జనాన్ని తప్పుదారి పట్టించేవి, విద్వేషాలు రెచ్చగొట్టేవి, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు పెట్టినా శిక్ష తప్పదంటున్నారు పోలీసులు. గ్రూప్ అడ్మీన్ తో పాటు పోస్ట్ పెట్టిన సభ్యుడికీ 3 నుంచి  5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాట్సాఫ్ మిస్ యూజ్ ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులు వాట్సాఫ్ లో చాటింగ్ చేస్తే.. రిప్లయ్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. వాట్సాప్ లో ఎవరైనా అసభ్యకరమైన పోస్ట్ లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతన్నారు.