
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందిని గృహలక్ష్మి స్కీమ్ లబ్ధిదారులుగా గుర్తించినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ఖజానాలో నిధుల సమస్య కారణంగా ఈ స్కీమ్‌కు ఇంత వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. త్వరగా ఫండ్స్రిలీజ్ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లక్ష మందిలో 16 వేల మంది వెంటనే ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోయాలని చెప్పటంతో కొంత మంది పునాదులు తీస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు మహిళ పేరుతో 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మూడు దశల్లో రూ.3 లక్షలను ఇవ్వనుంది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల చొప్పున 3,60,000 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మరో 40 వేల ఇండ్లను సీఎం తన విచక్షణ అధికారం కింద కేటాయించుకున్నారు. వీటికి బడ్జెట్ లో రూ.12 వేల కోట్లను కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సర్కారు స్కీమ్ ను హడావుడిగా స్టార్ట్ చేసింది. అయితే ఒకే జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది. డబుల్ ఇండ్లు పంపిణీ చేయకపోవటంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న పబ్లిక్ కు ఈ స్కీమ్ ను ప్రకటిస్తే వ్యతిరేకత తగ్గుతుందని భావించింది. అయితే ఈ స్కీంకు ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయకపోవటం గమనార్హం.