
- 9 శాతమున్న అగ్రకులాలకు 10% కోటా ఇచ్చారు
- 56 శాతమున్న బీసీలకు 42% కోటా ఎందుకు ఇవ్వరు?
- దేశంలో ఇంత శాస్త్రీయంగా కులగణన గతంలో జరగలేదు
- కులగణన లెక్కలు తప్పన్నవాళ్లు ఏది కరెక్టో కూడా చెప్పాలి
- బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేనివాళ్లే కులగణనను తప్పుపడ్తున్నరని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: 9 శాతమున్న అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్‌కింద 10% రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు, 56 శాతమున్న బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా సాధ్యమేనని ‘కులగణన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ’ వైస్ చైర్మన్ ప్రొఫెసర్కంచ ఐలయ్య స్పష్టం చేశారు. తెలంగాణలో అత్యంత శాస్త్రీయంగా కులగణన జరిగిందన్న ఆయన.. ఆ రిపోర్ట్ ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తేల్చాల్సిందేనని అన్నారు.
ఒకవేళ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చెల్లవని కోర్టు కొట్టివేస్తే, మరి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారనే వాదనలు మొదలవుతాయని.. ఇది మరో బీసీ ఉద్యమానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశ జాతీయోత్పత్తి మొత్తం బీసీల మీదే ఆధారపడి ఉందని.. వాళ్లు ఏకమైతే ప్రభుత్వాలు, దేశం ఆగమవుతాయని అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేనివాళ్లే కులగణనను తప్పుపడ్తున్నారని పేర్కొన్నారు. శనివారం ‘వీ6 వెలుగు’కు ఐలయ్య ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా?
ఐలయ్య: ఎందుకు సాధ్యం కాదు? కులగణన రిపోర్ట్ ప్రకారం.. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తేల్చాల్సిందే. మా రిపోర్టుపైనా కోర్టులో చర్చ జరుగుతుంది. ఒకవేళ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చెల్లవని కోర్టు అంటే.. మరి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారనే వాదనలు మొదలవుతాయి. 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కావని కోర్టు అంటే, కోర్టు తీర్పుపై ప్రజల్లో ఆగ్రహం మొదలవుతుంది కదా? ‘బీసీల్లో ఐక్యత లేదు.. అందరు ఏకం కారు’ అన్న వాదనల్లో నిజం లేదు. మండల్ కమిషన్ టైమ్‌లో బీసీలంతా రోడ్ల మీదికి వచ్చారు. ఇప్పుడూ అదే జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రధానులు కులగణన ఎందుకు చేయలేదు?
నేను కురుమ కులంలో పుట్టాను. మా తల్లిదండ్రులు గొర్లు, మేకలు కాశారు. ఆ ఊరులో ఎవరికి రాని తెలివి కంచ ఐలయ్యకు ఎందుకు వచ్చింది? నెహ్రూ, ఇందిరా, రాజీవ్ ప్రధానులుగా పనిచేసినా వారెవరూ బీసీలను పట్టించుకోలేదు. అదే వంశం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ బీసీల గురించి ఆలోచన చేస్తున్నారు. వారికి రాని ఆలోచన ఈయనకు వస్తే తప్పేంటి? జనగణనలో కులగణన చేయాలని బీసీ ప్రధానిని గతంలో అడిగితే.. ‘ఈ దేశంలో కులాలే లేవు. దేశంలో ధనిక, పేద రెండే కులాలు ఉన్నాయి’ అని అన్నారు. కులగణన గురించి అడిగినోళ్లపై అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేశారు. కానీ రాహుల్ తెలంగాణలో కులగణన చేయించేసరికి 2026 జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించారు. రాహుల్వల్లే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
కులగణన లెక్కలు తప్పంటున్నారు కదా? దీనికి మీ సమాధానం?
నేను కులగణన లెక్కలన్నింటినీ పరిశీలించాను. కులగణన లెక్కలు తప్పు అనేవారు మరి కరెక్ట్ ఏదో చెప్పాలి. కేసీఆర్ హయాంలో చేసింది గణన కానే కాదు.. అది ఒక రోజు హడావిడి మాత్రమే. దేశంలో ఉన్న వాళ్లందరినీ పిలిచి లెక్క పెట్టారు. ఆ లెక్కలో కోడ్ లేదు.. మాన్యువల్ లేదు. రేవంత్సర్కారు చేసిన కులగణనలో ఇవన్నీ ఉన్నాయి. కులాల సంఖ్య, అన్ని కులాల పేర్లు, బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నవారి వివరాలు తీసుకున్నారు. వాటికి కోడ్ నంబర్లు ఇచ్చారు. కులగణన లెక్కలు కేంద్ర సెన్సస్ కమిషనర్, రిజిస్ర్టార్ ద్వారా పోల్చి.. కరెక్ట్ అవునా, కాదా వాళ్లు నిర్ధారిస్తారు. పనీపాటా లేని వాళ్లే కులగణనపై విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా గణన బీజేపీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా.. ఆ లెక్కలను అంగీకరించాల్సిందే.
కులగణనలో శాస్త్రీయత లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా?
బీఆర్ఎస్నేతలకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే.. వాళ్లు చేసిన సమగ్ర సర్వే గణాంకాలను ఎందుకు బయటపెట్టలేదు. అగ్రవర్ణ రిజర్వేషన్లను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు వ్యతిరేకించలేదు. రెడ్డి, కమ్మ, బనియాలు, పటేల్, వెలమలు.. ఇలా దేశంలోని అగ్రవర్ణాలందరినీ కలిపినా 9 శాతం దాటరు. ముస్లింలలోని అగ్రవర్ణాలను కలిపినా 9.9 శాతం మందే.
కానీ ఇవాళ మెడికల్, ఐఐటీ, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఈడబ్ల్యూఎస్కోటాలో ఎస్సీ, ఎస్టీలు, బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినవాళ్లూ సీట్లు పొందుతున్నారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ ఏం సమాధానం చెప్తాయి? తెలంగాణలో ఆ రెండు పార్టీలకు ఇదో పరీక్ష కాబోతోంది. నేను బీసీల కోసం పోరాడుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నన్ను తిడ్తున్నారు. బీజేపీలో నితిన్ మాలవీయ లాంటివాళ్లు నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడ్తున్నారు. దత్తాత్రేయ, ఈటల, సంజయ్ ఏం చేస్తున్నారు? బీసీ రిజర్వేషన్లపై వాళ్ల స్టాండ్ ఏంటి?
ప్రభుత్వం కులాల వారీ లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు? ఇందులో ఏదైనా మర్మం ఉందా?
నిజానికి దేశంలో ఎక్కడ, ఎప్పుడు ఇంత పకడ్బందీగా కులగణన జరగలేదు. కులగణనలో 242 కులాల జనాభా బయటపడింది. 43 పారామీటర్స్ ఆధారంగా అభివృద్ధిలో ఏ కులం ఎక్కడ? ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలిసింది. తెలంగాణలో జరిగిన కులగణన దేశానికి ఒక రోల్‌మోడల్ అనడంలో అనుమానంలేదు. ఈ లెక్కలు బయట పెట్టాలని, పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని రాత పూర్వకంగా ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. కేబినెట్ ఆమోదం తరువాత బయటపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ఢిల్లీలో కాంగ్రెస్నిర్వహించిన బీసీ లీడర్ల మీటింగ్‌కు 65వేల మంది హాజరయ్యారు. స్టేడియం బయట మరో 65 వేల మంది ఉండిపోయారు. బీజేపీ ఏనాడూ ఇలాంటి మీటింగ్పెట్టలేదు.
బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే అంగీకరించబోమని బీజేపీ చెప్తోంది కదా?
రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉంటే, అందులో 10 శాతం ముస్లింలు ఉన్నారు. వీళ్లు లేకుండా బీసీలు 46 శాతం ఉన్నారు. అందరికీ కలిసి అడుగుతున్నది 42శాతం. అంటే వారి జనాభా కన్నా 14 శాతం తక్కువ. దీనికి బీజేపీ నేతలు ఎందుకు అడ్డుపడ్తున్నారు. మరి 9శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటే బండి సంజయ్ లాంటివాళ్లు ఎందుకు అడ్డుకోలేదు. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సైతం అడ్డుకోలేదు. కేంద్రంపై ఒత్తిడి కోసం కాంగ్రెస్ నేతలు 3 రోజులు ఢిల్లీలో పోరాటానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్వాళ్లు 8న మీటింగ్పెట్టుకున్నారు. బీజేపీలోని బీసీ నేతలు మాత్రం ఏం చేస్తున్నారో చెప్పకుండా ముస్లింల సాకు చెప్తున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగం అడ్డు వస్తున్నదా? రాజకీయాలు అడ్డు వస్తున్నాయా?
42శాతం బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు. గవర్నర్‌కు పంపారు. ఆయన రాష్ర్టపతికి పంపారు. అక్కడ లేట్ అవుతోందని మరో ప్రయత్నంగా పంచాయతీ రాజ్చట్టంలో సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా రాష్ట్రపతి దగ్గరే ఆగింది. గతంలో బీసీ ఉద్యమంలో నేను ఉన్నాను.. అప్పుడు దత్తాత్రేయ ఉన్నారు. బండి సంజయ్ లేరు. ఆ పోరాటంలో ఎంతో మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. బీజేపీలో ఉన్నవాళ్లెవరూ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడటం లేదు. భవిష్యత్తులో రిజర్వేషన్లు వస్తే బీజేపీ నేతలు, వారి పిల్లలు ఆ రిజర్వేషన్లను ఉపయోగించుకోకుండా ఉంటారా? బీజేపీ నేతలు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్ల కోసం ఏనాడూ పోరాటాలు చేయలేదు. మత పరంగా పోరాటాలు చేస్తున్నారు. ఇతరులు చేసిన పోరాటాలను అంగీకరించటం లేదు.