అనుష్కను కలిసిన క్షణం.. అదే నా లైఫ్ ఛేంజింగ్ మూమెంట్‌ : కోహ్లీ

అనుష్కను కలిసిన క్షణం.. అదే నా లైఫ్ ఛేంజింగ్ మూమెంట్‌ : కోహ్లీ

స్టార్ క్రికెటర్లలో ఒకరైన విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్టార్ కపుల్ అంటే అటు క్రికెట్ అభిమానులకే కాదు.. అటు సినిమా ప్రపంచంలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకుంటుండడం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. తన జీవితం ఎప్పట్నుంచి మారిపోయిందో వెల్లడించారు. అనుష్కను కలిసిన క్షణం నుంచే తన జీవితంలో మార్పు మొదలైందని స్పష్టం చేశారు. తన తండ్రి దూరమైన తర్వాత తనలో వచ్చిన మార్పును సైతం కోహ్లీ వెల్లడించారు.

తనకు తన తండ్రి దూరమైన క్షణం నుంచి తాను జీవితాన్ని చూసే కోణం మారిందని కోహ్లీ చెప్పారు. దాని వల్ల తన ఆలోచనాధోరణిలో మార్పు వచ్చింది కానీ.. తన జీవితం మారలేదన్నారు. తన చుట్టూ ఉన్న ప్రపంచం మునపటిలాగే ఉందని.. ఎప్పటిలాగే తాను క్రికెట్ ఆడుతూనే ఉన్నానని, అన్ని పనులూ చేస్తున్నానని తెలిపారు. కానీ అనుష్క ఎప్పుడైతే తనకు పరిచయం అయిందో.. ఆ క్షణం నుంచి తన జీవితం మారిపోయిందని కోహ్లీ చెప్పారు. తన జీవితం మారిన క్షణం ఏంటని అడిగితే.. అనుష్కతో మొదలైన తన పరిచయమనే చెబుతానని తెలిపారు.

అప్పుడే తన జీవితంలో మరో కోణం చూశానని కోహ్లీ చెప్పారు. అప్పట్నుంచి తన ప్రపంచం మునుపటిలా లేదని, మారిపోయిందని అనిపించిందన్నారు. అది మీరు ప్రేమలో పడినప్పుడు.. ఆ మార్పులు మీలో కూడా రావడం ప్రారంభమవుతాయని చెప్పారు.  భవిష్యత్తుల్లో ఇద్దరు కలిసి ప్రయాణించాలి కాబట్టి చాలా విషయాలను అంగీకరించాలని, అందుకు తగ్గట్టుగా మార్పు మొదలవుతుందని కోహ్లీ అన్నారు. అందుకే అనుష్కను కలిసిన క్షణాన్ని లైఫ్ ఛేంజింగ్ మూమెంట్‌గా చెప్తాననంటు విరాట్ తన మనసులోని భావాలను పంచుకున్నారు.