
జూబ్లీహిల్స్ నియోజవర్గంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ప్రత్యేక కేటాయింపులతో పరిష్కరిస్తామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం (జులై 11) జూబ్లీహిల్స్ నియోజకర్గంలోని పలు వార్డులలో రూ.5 కోట్ల 12 లక్షల విలువైన అభివృద్ధి పనులను మంత్రులు విపొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు . జూబ్లీహిల్స్, షేక్ పేట్, యూసఫ్ గూడ, వెంగల్ రావు నగర్ లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రులు.
షేక్ పేట్ వార్డులో ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ పార్క్ కు శంకుస్థాపన చేశారు మంత్రులు. అదే విధంగా కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి అనంతరం సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆ తర్వాత వెంగల్ రావు నగర్ వార్డు లో గురుద్వార్ కమాన్ దగ్గర చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు . అదేవిధంగా యూసఫ్ గూడ వార్డులో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కలెక్టర్ హరి చందన, కార్పొరేటర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే అంశంపైనే దృష్టి పెట్టారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు నగర అభివృద్ధి మరిచి.. వెయ్యి కోట్ల రూపాయలను నేషనల్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి వృధా ఖర్చులు పెట్టీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా నాళాలు, సీసీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సమస్యలను తీర్చమని పబ్లిక్ కోరుతున్నారని చెప్పారు. తమకు రోడ్లతో పాటు నాళాలు కూడా కావాలని కోరుతున్నాని.. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నింటినీ తీర్చుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
గత పదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో అనే అంశంపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందనీ.. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే స్పెషల్ శాంక్షన్ చేయించి.. అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
గత పదేళ్లలో పట్టించుకోని వాళ్లు ఉపఎన్నికలు రాగానే వస్తున్నారు: మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గత పదేళ్లలో పట్టించుకోని గత పాలకులు.. ఇప్పుడు ఉపఎన్నికలు రాగేనే వస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం. కొందరు ట్రబుల్ షూటర్లమంటూ వస్తున్నారని.. వాళ్లు గత పదేళ్లలో జూబ్లీహిల్స్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ప్రజలు అభివృద్ధి దిశగా ఆలోచించి కాంగ్రెస్ ను గెలిపించారని.. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పారు.
కేంద్రం సహకరించకపోయినా.. సిటీని నెంబర్ వన్ గా మార్చుతున్నాం: మంత్రి తుమ్మల
హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీగా మారిందని మంత్రి తుమ్మల అన్నారు. కేంద్రం సహకరించకపోయినా.. సిటీని నెంబర్ వన్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. బెంగుళూరు, చెన్నై ను మించి హైదరాబాద్ మంచి పేరు వస్తుందని చెప్పారు.
సంవత్సరన్నర కాలంగా నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని తెలిపారు. నగరంలో మంచినీటి, రహదారి వ్యవస్థను ను డెవలప్ చేస్తున్నామని.. పది కాలాల పాటు బాగుండాలంటే మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. పేదల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని.. జూబ్లీహిల్స్ ప్రజలు తీసుకోబోయే నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిస్తే భారతదేశ రాజకీయాల్లో కీలక మలుపు గా ఉంటుంద చెప్పారు మంత్రి తుమ్మల.
స్థానికంగా ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకురండి: కలెక్టర్
రేషన్ కార్డు సమస్యలున్నా, స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు కలెక్టర్ హరిచందన.ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. పాడైన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి లు అంతా ఫ్రీ బస్ సౌకర్యం ఉపయోగించుకుంటున్నారని.. మహిళలను కోటీశ్వరులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.