మీ సెల్ఫీల్లో 'పర్ఫెక్ట్‌గా' కనిపించాలని ప్రయత్నిస్తున్నా మీ హెయిర్ పర్ఫెక్ట్‌గా సెట్ కాలేదని అనిపిస్తుందా...? మీ పొడి జుట్టు తేమను సరిగా లాక్ చేయలేకపోవడానికి ఇదొక సంకేతం ! చాలామంది ఇందుకు నెయ్యి పూసి మృదువుగా మార్చుకోవడానికి చూస్తారు. కానీ ఇది నిజంగా వర్కవుతుందా? ఒక నెల పాటు జుట్టుకి నెయ్యి అప్లై చేస్తే ఏమవుతుందో తెలుసా...
డెర్మటాలజిస్ట్ సింగ్ ప్రకారం జుట్టు పొడిగా, గరుకుగా లేదా ఒత్తిడికి గురై దాని సహజ మృదుత్వాన్ని కోల్పోయినప్పుడు ఫ్రిజ్ అవుతుంది. చాలామంది జుట్టు గరుకుగా, పొడిగా తయారైనప్పుడు మళ్లీ మెరుపు రావడానికి నెయ్యిని వాడుతుంటారు. దీనిపై చర్మ నిపుణులు చెబుతున్న విషయాలు ఇవే:
జుట్టులో తేమ తగ్గినప్పుడు అది పొడిగా, గడ్డిలా తయారవుతుంది. ఎక్కువగా షాంపూ చేయడం, ఎండలో తిరగడం, వేడి నీళ్లతో తలస్నానం, కెమికల్స్ వాడటం వల్ల జుట్టు సహజత్వాన్ని కోల్పోతుంది.
నెయ్యి ఎలా సహాయపడుతుంది?
నెయ్యిలో 'విటమిన్-ఎ' ఇంకా మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టుకు ఒక రక్షణ పొరలా పనిచేసి, జుట్టును మెత్తగా (Soft) చేస్తాయి.
వారానికి రెండుసార్లు, నెల రోజుల పాటు వాడితే జుట్టు చిక్కు పడకుండా, మృదువుగా మారుతుంది. 2 నుండి 3 వారాల్లోనే ఈ మార్పును గమనించవచ్చు.
ఎలా వాడాలి?
నెయ్యిని జుట్టుకు రాసిన తర్వాత 30 నుండి 60 నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి. నెయ్యి రాసి రాత్రంతా అలాగే వదిలేయడం మంచిది కాదు. దీనివల్ల తలలోని రంధ్రాలు మూసుకుపోయి, దుమ్ము పేరుకుపోయే అవకాశం ఉంది. రాసుకున్న గంట తర్వాత లైట్ గా షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు బాగా పొడిగా, గరుకుగా ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. నెయ్యిలో కొబ్బరి నూనె లేదా కలబంద కలిపి రాస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
మీకు చుండ్రు ఉంటే మాత్రం నెయ్యిని అస్సలు వాడకండి. ఇది చుండ్రును ఇంకా ఎక్కువ చేస్తుంది. అలాగే తల చర్మం జిడ్డుగా ఉన్నవారు, మొటిమల సమస్య ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. నెయ్యి అనేది జుట్టు మెరిసేలా చేయడానికి ఒక మంచి చిట్కా మాత్రమే. ఇది జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపదు. జుట్టు లోపల నుండి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం కూడా అవసరం.
