‘ప్రధానికి నో ఎంట్రీ’ అంటూ టీఆర్ఎస్ హోర్డింగ్‌‌లు

‘ప్రధానికి నో ఎంట్రీ’ అంటూ టీఆర్ఎస్ హోర్డింగ్‌‌లు
  • ఐఎస్‌‌బీ కాన్వొకేషన్, బీజేపీ సమావేశాలప్పుడూ ఇలానే బోర్డులు

  • ఏపీలో మోడీ పర్యటనకు అక్కడి ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు

  • ఇక్కడ రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం

  • ప్రధాని రాకపై తమకు ఆహ్వానం అందలేదని తొలుత బుకాయింపు

  • సీఎంకు పంపిన ఇన్విటేషన్‌‌ను కేంద్రం రిలీజ్ చేయడంతో గప్‌‌చుప్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న వేళ టీఆర్‌‌ఎస్‌‌ మళ్లీ ‘నో ఎంట్రీ’ బోర్డులు పెట్టింది. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు టీఆర్‌‌ఎస్‌‌ ఇలాంటి హోర్డింగులు ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. రామగుండం ఫర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ ప్రారంభోత్సవానికి మోడీ శనివారం రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం ఏపీలోని వైజాగ్‌‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌‌పోర్టుకు చేరుకుంటారు. ఏపీలో ప్రధాని పర్యటనకు అక్కడి వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుండగా, రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికే వస్తున్నా.. అధికార పార్టీ మాత్రం రాజకీయ కోణంలోనే చూస్తున్నది. 

ప్రధాని టూర్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకునేందుకు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీనే వెనకుండి ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని మొదట ఎదురుదాడికి దిగిన ప్రభుత్వ వర్గాలు.. కేంద్రం సీఎంకు పంపిన ఆహ్వాన లేఖను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ముఖం చాటేశాయి.

వరుసగా ఇదే తీరు

‘తెలంగాణ చేనేత యూత్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌’ పేరుతో గురువారం ఉదయం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పలు కూడళ్లలో బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోర్డింగులు వెలిశాయి. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేసిన మోడీకి తెలంగాణలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రింట్‌‌‌‌‌‌‌‌ చేశాయి. పోలీసులు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు కొంతసేపటి తర్వాత వీటిని తొలగించారు. తర్వాత ప్రధానికి వ్యతిరేకంగా ఉన్న పాటలతో కూడిన వీడియోలను ఈ హోర్డింగులతో కలిపి మిక్స్‌‌‌‌‌‌‌‌ చేసి వివిధ సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా వింగ్‌‌‌‌‌‌‌‌ వాళ్లు ప్రచారం చేశారు. ఫొటోలను వైరల్‌‌‌‌‌‌‌‌ చేశారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే కొందరు వ్యక్తులే ఈ హోర్డింగులు ఏర్పాటు చేశారని, వాటిని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ చేశారని తెలుస్తున్నది. ఈ ఏడాది మే 26న ఐఎస్‌‌‌‌‌‌‌‌బీ కాన్వొకేషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు మోడీ వచ్చారు. అప్పుడూ నిరుద్యోగులు, యువత పేర్లతో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఇలాంటి ఫ్లెక్సీలే ఏర్పాటు చేసింది. జులైలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోడీకి వ్యతిరేక పోస్టర్లు, బోర్డులు, హోర్డింగులతో సిటీతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలను నింపేసింది. బీజేపీ సమావేశాల ముగింపు సందర్భంగా జింఖానా గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే.. దానికి ఎదురుగా మోడీ వ్యతిరేక నినాదాలతో కూడిన బెలూన్లు ఎగురవేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కనీసం ప్రచారం దక్కకుండా చేయాలని ప్రభుత్వమే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అన్ని హోర్డింగులు, మెట్రో పిల్లర్లు బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. ఇప్పుడు రామగుండానికి మోడీ వస్తున్నా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నది.

ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌ నుంచే స్కెచ్?

మోడీ రామగుండం పర్యటనను అడ్డుకోవడానికి ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగానే అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సెక్రటరీలతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి, తన ప్రతినిధులను పంపి చర్చలు జరిపి మరీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌లోని ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ను ఎత్తేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. అప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎందరో ప్రజాసంఘాల నేతలతో ప్రధాని టూర్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవాలని కోరినట్టు సమాచారం.

ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు సన్నిహితంగా   ఉండే ప్రజాప్రతినిధులను ఆయా సంఘాల నేతల వద్దకు పంపి.. వారి ఫోన్ల ద్వారా కేసీ ఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారని చెప్తున్నారు. ప్రభుత్వపరం గా ప్రధాని టూర్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే కార ణంతో.. వివిధ వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేసేలా ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌ ముఖ్యులు స్కెచ్‌‌‌‌‌‌‌‌ వేసినట్టుగా తెలుస్తున్నది. తమ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా వింగ్‌‌‌‌‌‌‌‌లోని కొందరిని రంగంలోకి దింపి హోర్డింగులు ఏర్పాటు చేయించారు.