బౌండరీతో కూడిన మ్యాప్ లేకుండానే రిజిస్ట్రేషన్లు

బౌండరీతో కూడిన మ్యాప్ లేకుండానే రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, వెలుగు: ఎక్కడైనా ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఆ ప్లాట్ కు సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలతో కూడిన మ్యాప్, నాలుగువైపులా ఎవరెవరి ప్లాట్లు ఉన్నాయనే వివరాలను పొందుపరచడం తెలిసిందే. ధరణి కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. డాక్యుమెంట్లలో ల్యాండ్ మ్యాపును కూడా చేర్చే అవకాశముండేది. కానీ ధరణి పోర్టల్ వచ్చాక అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవసాయ భూములకు ఇలా హద్దులు చూపట్లేదు. పట్టాదారు పాస్ బుక్​లో సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, విస్తీర్ణం మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు. హద్దుల వివరాలు లేకపోవడంతో భవిష్యత్​లో గెట్టు తగాదాలు పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

నిజాం కాలం నాటి నక్షలు

సాధారణంగా ఒక్కో సర్వే నంబర్​లో ఎకరం నుంచి మొదలు వేల ఎకరాల్లో భూమి ఉంది. నిజాం హయాంలో రూపొందించిన టిప్పన్, నక్ష ప్రకారం సర్వే నంబర్లవారీగా గీసిన మ్యాప్​లే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 80 ఏళ్లలో తరాలు మారినకొద్దీ కుటుంబాల్లో పంపకాలు అవుతున్నకొద్దీ.. అమ్మకాలు, కొనుగోళ్లతో రికార్డుల  సౌలభ్యం కోసం సర్వే నంబర్లలో అనేక బై నంబర్స్ వచ్చి చేరాయి. ఇటీవల నాన్ లే ఔట్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం నిషేధించిందని.. కొందరు రియల్టర్లు వ్యవసాయ భూములను ఫార్మ్ ప్లాట్లుగా గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో బై నంబర్లు చాంతడంతా పెరిగిపోతున్నాయి. ఈ బై నంబర్లవారీగా మ్యాపుల్లేవు. ఏదైనా గెట్టు తగాదా వస్తే మొత్తం సర్వే నంబర్ కు సంబంధించిన హద్దులు మాత్రమే చూపగలుతామని, సబ్ డివిజన్ల వారీగా చూపలేమని రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో చాలా చోట్ల గెట్ల పంచాయితీలు పరిష్కారం కాకుండా ఘర్షణలవుతున్నాయి. స్థానిక రైతుల మధ్య గెట్టు పంచాయితీలు తక్కువేనని, ఇతర ప్రాంతాల్లో ఉంటూ భూములను కౌలుకు ఇవ్వడమో, పడావు పెట్టడమో చేసేవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఓ రూరల్ ఏరియా తహసీల్దార్ వెల్లడించారు. 

ఒక సర్వే నంబర్​లో ఎన్నో బై నంబర్లు.. 

ఉదాహరణకు 210 సర్వే నంబర్ లో 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 ఎకరాల భూమి ఉందనకుందాం. అందులో ఒక్కొక్కరికి అర ఎకరం, ఒక ఎకరం, రెండెకరాల చొప్పున 30 మంది వరకు ల్యాండ్ ఓనర్లు ఉన్నారు. వారి పేరు మీద పాస్ బుక్స్ ఇచ్చేందుకు 210 సర్వే నంబర్ ను 210/1, 210/2, 210/3 అనో లేదంటే 210ఏ, 210బీ అనో ఇలా 30 బై(సబ్ డివిజన్) నంబర్లను రెవెన్యూ అధికారులు వేయాల్సి వచ్చింది. బై నంబర్లవారీగా మ్యాపులు, కొలతలు మాత్రం లేవు. దీంతో 210 సర్వే నంబర్ లో ఓ రెండెకరాలు ఉన్న వ్యక్తి.. మొత్తం 50 ఎకరాల భూమిలో ఎటువైపయినా తన భూమి ఇదేనంటూ క్లెయిం చేసుకునే చాన్స్ ఉంది. రెవెన్యూ అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపే పరిస్థితి లేనందున భూముల యజమానుల మధ్య ఘర్షణలు పెరిగే చాన్స్ ఉంది.

ధరణి రిజిస్ట్రేషన్లలో మ్యాప్​ను జత చేయాలి 

ఇండ్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ లాగే వ్యవసాయ భూములకు కూడా రిజిస్ట్రేషన్ సమయంలో మ్యాప్ జత చేస్తేనే గెట్టు తగాదాలకు చెక్ పెట్టొచ్చు. వ్యవసాయం చేసేవాళ్లకు తప్ప.. వ్యవసాయానికి దూరమైన జనరేషన్​కు తమ భూముల హద్దులు ఎక్కడున్నాయో తెలియడం లేదు. చుట్టూ హద్దులు, కొలతలతో కూడిన మ్యాపులు ఉంటే గెట్టు పంచాయతీలకు ఆస్కారం ఉండదు.
- మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్, ధరణి సమస్యల వేదిక