మేం పవర్​లోకి రాగానే.. భైంసా పేరుమారుస్తం : బండి సంజయ్

మేం పవర్​లోకి రాగానే.. భైంసా పేరుమారుస్తం : బండి సంజయ్
  • కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని ఫైర్ 
  • టీఆర్​ఎస్​కు పోలీసుల చెంచాగిరి: కిషన్​రెడ్డి
  • అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తం
  • పీడీ యాక్టు తొలగిస్తం.. ప్రభుత్వ ఉద్యోగాలిస్తం: బండి సంజయ్  

నిర్మల్, వెలుగు : రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, భైంసా అల్లర్ల బాధితులందరిపై పీడీ యాక్టులతో పాటు ఇతర అన్ని కేసులనూ ఎత్తివేస్తామని బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ ప్రకటించారు. భైంసా బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. భైంసాలో హిందూ వాహిని కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వారిపై పీడీ యాక్ట్ ను తొలగించేందుకు బీజేపీ న్యాయ పోరాటం చేసిందన్నారు. భైంసా అల్లర్ల బాధితులందరికీ చప్పట్లతో సంఘీభావం తెలపాలని కోరారు. దీంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామన్నారు. భైంసా పట్టణం పేరును ‘మహిషా’గా మారుస్తామని ప్రకటించారు. కేసీఆర్, ఒవైసీలు కుమ్మక్కై భైంసాలో హిందూవాహినిని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ నిర్బంధాలకు భయపడవద్దని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం భయపడి అప్రకటిత నిషేధం విధించడం దారుణమన్నారు. హిందూ దేవతలను కించపర్చే మునావర్​ఫారూఖిలాంటి వారికి ఎక్కడైనా సమావేశాలు పెట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తున్న రాష్ట్ర సర్కారు.. బీజేపీ సభలపై మాత్రమే నిషేధం విధించడం వెనక కుట్ర ఉందన్నారు. ‘‘భైంసాలో ప్రవేశంపై నిషేధం ఎందుకు? ఈ ఊరేమైనా పాకిస్తాన్ లో, అఫ్గానిస్తాన్ లో ఉందా?” అని మండిపడ్డారు. 

స్టూడెంట్లపైనా జులుం చేసిన్రు

సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనలు చేసిన బాసర ట్రీపుల్​ఐటీ స్టూడెంట్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం జులుం చూపిందని సంజయ్ విమర్శించారు. విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఉద్యమం చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచాలని చూసిందని, ట్రీపుల్​ఐటీ క్యాంపస్ మొత్తాన్ని దిగ్బంధం చేసిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను సైతం లోనికి పోనియ్యలేదన్నారు. కానీ విద్యార్థుల ఉద్యమానికి ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాక తప్పలేదన్నారు. బీజేపీ వస్తే.. అందరికీ ఉచిత విద్య, వైద్యం సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలను పక్కనపెట్టి.. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి తలా రూ. 1.2 లక్షల భారం మోపాడని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ, దళిత బంధు వంటి అన్ని విషయాల్లోనూ కేసీఆర్ మోసం చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, ఇండ్లు లేని వారందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తామని బండి సంజయ్ చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన కింద సాయం చేస్తామన్నారు. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. 

బీజేపీలోకి రామారావు పటేల్​

డీసీసీ మాజీ అధ్యక్షుడు పవార్​ రామారావు పటేల్​ మంగళవారం భైంసా బహిరంగ సభ వేదికపై బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ స్టేట్​చీఫ్​బండి సంజయ్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటేల్​తో పాటు కుంటాల ఎంపీపీ అప్క గజ్జరాం, మున్సిపల్ మాజీ చైర్మన్​ గంగాధర్​ బీజేపీలో చేరారు. రామారావు మాట్లాడుతూ.. సీనియర్​ ఒవైసీ, జూనియర్ ఒవైసీలు ఇక్కడ జరుగుతున్న సభను చూసి జడుసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే అందరి ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. సంజయ్ సభ, పాదయాత్ర వాయిదాకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి కారకులని ఆరోపించారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా కాంగ్రెస్​  ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు బీజేపీలో చేరారు.