అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్

అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్

తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటామన్నారు. బైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడాలని బండి సంజయ్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపే కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కు మూడిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

ఈరోజు బీజేపీని బైంసాకు రాకుండా నిషేధించారని, బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బైంసాకు రావాలంటే వీసా తీసుకుని రావాలా? అని నిలదీశారు. మతవిద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చు...కానీ తమ దేవతలను కించపర్చే మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చట అని కామెంట్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ వాళ్లు మాత్రం సభలు పెట్టుకోవద్దట అని బండి సంజయ్ అన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ దేశంలో ఉన్నాం? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశాన్ని అప్పుల పాలు జేసిండని, అదోగతి పాలు చేసిండని, ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణ మాత్రం అదోగతి పాలైతుందని బండి సంజయ్ర్ ఆరోపించారు. రూ.5 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలిస్తనన్న నరేంద్ర మోడీ.. ఒక్క రోజులోనే 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలిచ్చారని చెప్పారు. కేసీఆర్ మాత్రం ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ముథోల్ లో ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చినవ్, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినవ్.. ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నిలదీశారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తాము సమస్యలు పరిష్కారం చేయమని నిరసన చేస్తే.. ఈ రోజు వాళ్లపై ర్యాగింగ్ కేసులు పెడ్తామని, వాళ్ల సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తామంటున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్లు అడిగింది గొంతెమ్మ కోరికలేం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నీ చుట్టపోడు కాబట్టే.. ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెడ్తున్నరని ఆరోపించారు. వారిపై కేసులు పెడితే తాము దేనికైనా తెగించి, కోట్లాడతామని స్పష్టం చేశారు. కనీసం ప్రాజెక్టులను మెయింటెన్స్ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ సంగ్రామ యాత్ర చేపట్టిందన్న ఆయన.. బైంసా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మీకు అండగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు.