
- ఎటూ తేల్చని ఎన్‌ఎంసీ.. త్వరగా తేల్చాలంటున్న రాష్ట్ర సర్కార్
- మరో 20 రోజుల్లో మొదలవనున్న ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
- ఆ కాలేజీలకు పర్మిషన్ వస్తే అందుబాటులోకి మరో 400 సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసిన కొత్త మెడికల్ కాలేజీల పర్మిషన్లపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఇప్పటివరకూ నిర్ణయాన్ని ప్రకటించలేదు. అసలు పర్మిషన్లు ఇస్తరో, ఇవ్వరో అనే సమాచారాన్ని కూడా రాష్ట్ర అధికారులకు ఇవ్వలేదు. గద్వాల, వరంగల్(నర్సంపేట్), యాదాద్రి, మేడ్చల్ (కుత్బుల్లాపూర్), నారాయణపేట్, ములుగు, మెదక్, రంగారెడ్డి(మహేశ్వరం) జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ ఎన్‌ఎంసీకి నిరుడు ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ దరఖాస్తులు పంపింది.
ఆయా కాలేజీలను ఎన్‌ఎంసీ ఆఫీసర్లు నేరుగా తనిఖీలు చేయలేదు. కానీ, వర్చువల్‌గా చేశారు. కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని సూచించారు. ఈ మేరకు వాళ్లు సూచించినట్లుగా అధికారులు సవరణలు చేశారు. అయినా, ఇప్పటివరకూ మెడికల్ కాలేజీలకు అనుమతులపై ఎన్‌ఎంసీ ఎటూ తేల్చలేదు. మరోవైపు, ఇంకో 20 రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాలేజీలకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎన్‌ఎంసీకి విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్లకు నిరాకరిస్తే, అప్పీల్ చేసుకోవడానికి కూడా సమయం దొరకదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కౌన్సెలింగ్‌కు కనీసం రెండు నెలల ముందే కాలేజీల పర్మిషన్లపై ఎన్‌ఎంసీ తన నిర్ణయాన్ని ప్రకటించేది. 2022లో 8.. 2023లో 9 కాలేజీలకు ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఇందులో తొలుత మంచిర్యాల కాలేజీకి పర్మిషన్ నిరాకరించగా, రాష్ట్ర సర్కార్ అప్పీల్‌కు వెళ్లింది. రెండో అప్పీల్ తర్వాత సీట్ల సంఖ్యను 150 నుంచి వందకు కుదించి, కాలేజీకి ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. సమయం ఉండడం వల్ల రెండుసార్లు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం దొరికింది. కానీ, ఈసారి కౌన్సెలింగ్‌కు మరో 20 రోజులే ఉంది.
పర్మిషన్ వస్తే పెరగనున్న సీట్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 28 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,915 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 4,600 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 8,515 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్‌ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉన్న 8 కాలేజీలకు పర్మిషన్ వస్తే.. ఒక్కో కాలేజీకి 50 చొప్పున మరో 400 సీట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు.
తెలంగాణ నుంచి ఈసారి 77,849 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. వీరిలో 47,371 (60.84 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం ఉన్న కాలేజీల ప్రకారం చూస్తే ఒక్కో సీటుకు ఐదుగురు (5.56) స్టూడెంట్స్ పోటీ పడాల్సి ఉంది. అయితే, కొంత మంది ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ అడ్రస్ పెట్టి ఎగ్జామ్‌కు అటెండ్ అవుతారు. కొత్త కాలేజీలకు పర్మిషన్లు వచ్చి సీట్లు పెరిగితే, సీట్లకు పోటీ తగ్గే అవకాశం ఉంది.
త్వరగా తేల్చాలని కోరినం
మెడికల్ కాలేజీల అనుమతుల గురించి ఎన్‌ఎంసీని సంప్రదించాం. కౌన్సెలింగ్ సమయం దగ్గర పడుతున్నందున పర్మిషన్లు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. ఈ నెల చివరికల్లా పర్మిషన్లపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఎన్‌ఎంసీ అధికారులు చెప్తున్నారు. నీట్ ఎగ్జామ్‌కు సంబంధించిన వివాదాలు జరుగుతున్నందున,కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.
- డాక్టర్ వాణి, డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్