ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిస్తరా?

ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిస్తరా?
  • రెండు నెలల కిందట నామ్ కే వాస్తేగా అందించిన ప్రభుత్వం
  • హైదరాబాద్ లో లక్షా 10వేల అప్లికేషన్లలో 40 వేలు రిజెక్ట్
  • పలు ప్రాంతాల్లో సర్వే చేయకుండానే తొలగించినట్లు ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: కొత్త రేషన్​ కార్డులకు జనం వెయిట్​ చేస్తున్నారు. అర్హులకు జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు నెలల కిందట కొందరికి మాత్రమే అందించి సైట్​ను క్లోజ్​చేసింది. అందులో కూడా కొత్త వారికి అవకాశం లేకుండా గతంలో అప్లై చేసుకున్న వారికి మాత్రమే కార్డులను అందించారు. హైదరాబాద్​ జిల్లా పరిధిలో లక్షా10 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 40 వేల మంది అప్లికేషన్లను రిజెక్ట్​ చేశారు. 68 వేల మందికి కొత్త కార్డులు అందించి అందరికీ ఇచ్చామంటూ సైట్​ క్లోజ్​ చేశారు. దీంతో అర్హులైన వారు  మళ్లీ అప్లై చేసుకునే అవకాశం లేదు. కొత్తగా పెండ్లైనవారు,  పిల్లల పేర్లు యాడ్​చేసుకోలేకపోతున్నారు. 

ఎన్నికల కోసమేనా..
రెండేండ్లుగా సర్వర్​ ఓపెన్ అయిన ప్రతిసారి కొత్త రేషన్ కార్డుల కోసం జనం అప్లయ్​ చేసుకుంటూనే ఉన్నారు.  కార్డులు మాత్రం రావట్లేదు. హుజూరాబాద్​ ఎన్నికల నోటిఫికేషన్​ కు ముందు కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడంతో వెంటనే జారీ చేస్తున్నామని సీఎం ప్రకటించి కార్డులు అందించారు. అయితే అప్లై​చేసుకున్న వారిలో 40 శాతం మందిని రిజెక్ట్​ చేశారు. కొందరైతే వందశాతం అర్హులైనప్పటికీ వెరిఫికేషన్ చేయకుండానే అప్లికేషన్​రిజెక్ట్​ చేశారు. సిటీలో ఏ కాలనీకి పోయినా జనం ఇదే విషయాన్ని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతిళ్లు, బైక్, కారు లాంటివి లేని వారికి కార్డులు రాలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మళ్లీ ఎప్పుడిస్తరో
మళ్లీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారనే విషయం ప్రభుత్వం చెప్పడం లేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా వీలు లేదు. 2019కి ముందు ప్రతి ఏటా రేషన్ కార్డులను అందించారు. అప్పటి మాదిరిగానే కార్డులు జారీ చేయాలని జనం డిమాండ్​ చేస్తున్నారు. వచ్చే జనరల్​ఎలక్షన్​ సమయంలో కార్డులను జారీ చేస్తుందని జనం చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం స్పందిస్తుందని, ఎన్నికలు అయ్యాక పట్టించుకోవడంలేదని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ జిల్లా పరిధిలో లక్ష మంది వరకు అప్లై చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.