విద్యార్థి యువ వికాస పథకం..అమలు ఎప్పుడు? : దేవేందర్ ముంజంపల్లి

విద్యార్థి యువ వికాస పథకం..అమలు ఎప్పుడు? : దేవేందర్ ముంజంపల్లి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు పూర్తి చేసుకుంది. అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు గత ప్రభుత్వంపై విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్  మేము అధికారంలోకి వస్తే  మేనిఫెస్టోలో ఉన్నటువంటి  స్కీములను,  అలాగే  ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని వాగ్దానం చేసింది.

కానీ, ఇంతవరకు ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలుకు నోచుకోలేదు. 6 గ్యారంటీలలో ఉన్నటువంటి 5వ గ్యారెంటీ విద్యార్థి  యువ వికాసం గ్యారంటీతో  విద్యార్థులకు  విద్యా భరోసా కార్డు ఇస్తామని.  అలాగే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు యువ వికాసం స్కీమ్ గురించి ఒక స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులయినా విద్యార్థి  యువ వికాసం అమలు గురించి రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు  ఎక్కడా  స్పష్టత ఇవ్వడంలేదు.  

యువ వికాసంపై విద్యార్థుల్లో పలు ప్రశ్నలు

యువ వికాస పథకం ద్వారా ఫీజులు,  కోచింగ్  ఫీజు చెల్లింపుల కోసం ఐదు లక్షల రూపాయలు గ్యారంటీ కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ  ప్రభుత్వం.  రాష్ట్రంలో  ఏటా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు  డిగ్రీ,  ఇంజినీరింగ్, వైద్య, వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా దాదాపు పూర్తి కావస్తోంది.

అలాగే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ,  పీజీ,  ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని  కొన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు రాబోతున్నారు.  కానీ, ఇంతవరకు విద్యార్థులకు ఉపకార వేతనాలు అమలుకు నోచుకోలేదు. 2021–-2024 వరకు  దాదాపుగా 7,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావలసిన పరిస్థితి ఏర్పడుతోంది.  

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్  విడుదల  కాకపోవడంతో  సర్టిఫికెట్లు  తీసుకుందామని  కళాశాలలకు  వెళ్లిన  విద్యార్థులకు గతంలో లాగానే  చేదు అనుభవం ఎదురవుతున్నది. ఫీజు చెల్లిస్తేనే మీ సర్టిఫికెట్స్ ఇస్తామని  కళాశాలల యాజమాన్యాలు  కరాఖండిగా చెబుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు ఏం చేయాలో అర్థంకాక అయోమయ స్థితిలో ఉన్నారు.

ఇంటర్నేషనల్ స్కూల్స్ అమలు సాధ్యమేనా?

ప్రతి మండలంలో  ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జరిగేనా?   ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని యువ వికాసం స్కీమ్​లో  భాగంగా చెప్పడం జరిగింది,  కానీ, అది ఏమేరకు అమలవుతుందనేదే అందరి మదిలో  నెలకొన్న ప్రశ్న.  ప్రభుత్వం విద్యార్థి యువ వికాసం పథకంపై ఒక స్పష్టతను ఇవ్వాలి. విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను తొలగించాలి.

విద్యావ్యవస్థపై ఉదాసీనత

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​ను  విద్యార్థి యువ వికాసంలో  జత చేస్తారా లేక విడిగానే ఇస్తారా.. అనే  డైలమాలో విద్యార్థులు ఉన్నారు. ఈ  ప్రభుత్వమైనా మేల్కొని తక్షణమే  ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. విద్యార్థి యువవికాసం కార్డు ఎలా ఇస్తారు అనే దానిపై  ఇంతవరకు  ఎలాంటి  క్లారిటీ లేదు.  ఒకవేళ  ఈ కార్డుతో  విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తే  వడ్డీ ఎవరు భరిస్తారన్నది ప్రశ్నగా మారింది.

యువ వికాసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా అమలు చేస్తారా?  అంతేకాకుండా  రాష్ట్రంలో  విద్యారంగ  సమస్యలు  పట్టించుకోకుండా గత ప్రభుత్వం లాగానే గాలికి వదిలేస్తారా? కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు.  కాంగ్రెస్  ప్రభుత్వం  ఏర్పడి  ఇన్ని రోజులు కావస్తున్నా  విద్యారంగం వైపు  కన్నెత్తి   చూడడంలేదు.  విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు,  కళాశాల యజమానులు చెప్పుకుందామంటే ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడంతో.. ఎవరికి తెలియజేయాలో తెలియని అయోమయ స్థితి ఉంది.

- దేవేందర్ ముంజంపల్లి,
జర్నలిజం పరిశోధక విద్యార్థి,కాకతీయ యూనివర్సిటీ