ఆరు జిల్లాల్లో నెరవేరని విమానాశ్రయాల హామీ

ఆరు జిల్లాల్లో నెరవేరని విమానాశ్రయాల హామీ
  • జిల్లాల నుంచి విమానాలు ఎగిరేదెప్పుడు ?
  • ఆరు జిల్లాల్లో నెరవేరని విమానాశ్రయాల హామీ
  • చిన్న విమానాల తయారీని బంద్​ పెట్టిన సంస్థలు 
  • 70–80 విమానాలు నడిచేలా ఏర్పాట్లు చేసుకోవాలన్న ఏఏఐ  
  • కావాల్సిన భూమిని సేకరించని రాష్ట్ర సర్కార్‍


వరంగల్, వెలుగు : ఆరు జిల్లాల్లో ఎయిర్‍పోర్టులు రెడీ చేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ఏండ్ల సంది ప్రకటనలు చేస్తున్నా ఆచరణలోకి రావడం లేదు. వరంగల్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍, రామగుండం జిల్లాల నుంచి గతంలో విమానాలు నడవడంతో ఎయిర్‍ స్ట్రిప్స్​అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ నాలుగు జిల్లాలకు తోడు మరో రెండు జిల్లాల్లో విమాన సర్వీసులు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‍ మొదలు మంత్రి కేటీఆర్‍, ఇతర మంత్రులు అవకాశం ఉన్నప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. కానీ, ఎయిర్​పోర్ట్​అథారిటీ ఆఫ్‍ ఇండియా ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుందో లేదో తెలియకుండా ఉంది.  

చిన్న విమానాల తయారీ బంద్‍ 

రాష్ట్రంలో శంషాబాద్‍ ఇంటర్నేషనల్‍ ఎయిర్‍పోర్ట్, హైదరాబాద్​లోని బేగంపేట మినహా ఎక్కడా విమానాల రాకపోకలు సాగడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍తో పాటు రామగుండం, కొత్తగూడెం, మహబూబ్​నగర్‍ జిల్లాల్లో ప్రాంతీయ విమానాశ్రాయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదట 20 సీట్ల కెపాసిటీ ఉండే విమానాలు నడపనున్నట్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్‍ స్కీంలో అవసరమైన పర్మిషన్లు కూడా ఇచ్చింది. టూరిజం స్పాట్లు ఉండే ప్రాంతాలకు దగ్గర్లో గతంలో పనిచేసిన విమానాశ్రయాలను (బ్రౌన్‍ ఫీల్డ్‍) మళ్లీ రీ ఓపెన్‍ చేసేందుకు ముందుకొచ్చింది. ఎయిర్‍పోర్ట్​అథారిటీ అధికారుల బృందం 2020లో వరంగల్ లోని మామూనూర్‍ ఎయిర్‍పోర్ట్​ను సందర్శించి మట్టి నమూనాలు సేకరించింది. వాతావరణం సైతం అనుకూలంగా ఉందని చెప్పి గ్రీన్‍ సిగ్నల్‍ కూడా ఇచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన 18 నుంచి 20 సీట్ల కెపాసిటీ ఉండే చిన్న విమానాల తయారీని ఆయా సంస్థలు నిలిపివేశాయని ఏఏఐ కొన్ని రోజుల క్రితం రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది.  

విమానం ఎగరాలంటే రూ.400 కోట్లు కావాలే

20 సీట్ల వంటి చిన్న విమానాల తయారీని సంస్థలు ఆపేసిన క్రమంలో.. 70 నుంచి 80 సీట్లుండే ఏటీఆర్‍ –72, క్యూ–400 వంటి విమానాలు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఏఏఐ రాష్ట్రానికి సూచించింది. భూముల ధరలు పెరుగుతుండటంతో భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు సలహా ఇచ్చింది. రాష్ట్రం ఇచ్చిన మాట ప్రకారం ఆరు జిల్లాల్లో ఈ తరహా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలంటే మొదట ఎయిర్‍ స్ట్రిప్స్​అందుబాటులో ఉన్న వరంగల్‍, ఆదిలాబాద్‍, నిజామాబాద్, రామగుండంలో కావాల్సిన మేర భూసేకరణ చేయాలి. దీనికితోడు ఒక్కో ఎయిర్‍పోర్ట్​నిర్మాణానికి రూ.300 నుంచి రూ.400 కోట్లు ఖర్చు చేయాలి. కానీ సర్కారు ఇప్పట్లో  దిశగా ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు.

భూసేకరణ పూర్తయ్యేదెప్పుడు ? 

వరంగల్‍ జిల్లా మామునూర్ ఎయిర్‍పోర్ట్ నుంచి 1970 –77 మధ్య కాలంలో వాయుదూత్‍ విమానాలు నడిచాయి. ఇక్కడి ఇప్పటికే 750 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అయితే 70 నుంచి 80 సీట్ల కెపాసిటీ ఉండే విమానాలు నడవాలంటే 1200 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని చెప్పింది. దీనికి తాము కూడా రెడీగానే ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మే నెలలో కేటీఆర్‍ వరంగల్‍ జిల్లా పర్యటన సందర్భంగా మామూనూర్‍ ఎయిర్​పోర్ట్​ప్రాంతాన్ని పరిశీలించారు. విమానాశ్రాయ ఏర్పాటుకు అవసరమైన భూములను త్వరలోనే ఏఏఐకి అందిస్తామని మాటిచ్చారు. కానీ 425 ఎకరాలకు కేవలం 195 ఎకరాలు సేకరించి ఊరుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చెప్పినట్టు ఆరు జిల్లాల్లో విమానాలు ఎగురుతాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.