ఆరు గ్యారంటీలు ఎటుపోయినయ్? : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆరు గ్యారంటీలు ఎటుపోయినయ్? : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • అది సామాజిక అన్యాయ సమరభేరి: కేంద్ర మంత్రి బండి సంజయ్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ నిర్వహించింది సామాజిక న్యాయ సమరభేరి కాదని.. అన్యాయ సమరభేరి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సభ పెట్టారో రాష్ట్ర ప్రజలకు మల్లికార్జున ఖర్గే చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సభ పేరును ‘సామాజిక అన్యాయ సమరభేరి’గా మార్చుకోవాలని అన్నారు. ‘‘50 ఏండ్లు అధికారంలో ఉన్నరు. ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని చేశారా? కనీసం సీఎంను అయినా చేశారా?’’అని బండి సంజయ్ నిలదీశారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిపడ్ల గ్రామంలో రూ.5 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా 20 వేలకుపైగా గిరిజన జనాభా ఉన్న మండలాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం.  తెలంగాణలో 23 స్కూళ్లలో 10వేల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు’’అని బండి సంజయ్ తెలిపారు. 

రాష్ట్ర కేబినెట్​లో బీసీలెందరు?

రాజకీయాల్లో బీసీలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నదని బండి సంజయ్ అన్నారు. ‘‘బీసీ వ్యక్తిని బీజేపీ.. ప్రధానమంత్రిని చేసింది. దళిత వర్గానికి చెందిన రామ్​నాథ్ కోవింద్​ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును, మైనార్టీకి చెందిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే. 27 మంది ఓబీసీలకు, 12 మంది దళితులకు, 6గురు గిరిజనులకు, 8 మంది మహిళలకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించింది. రాష్ట్ర కేబినెట్​లో ఎంత మంది బీసీలకు అవకాశం కల్పించారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి’’అని సంజయ్ అన్నారు. యూరియా కొరతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘గత సీజన్​లో రాష్ట్రానికి 9లక్షల టన్నుల యూరియా అవసరమైతే.. కేంద్రం 12 లక్షల టన్నుల యూరియా ఇచ్చింది. ఈ సీజన్​లోనూ అడిగినంత యూ‌‌‌‌‌‌‌‌రియా ఇచ్చేందుకు కేంద్రం రెడీగా ఉన్నది’’అని బండి సంజయ్ అన్నారు. 

మోదీపై కాంగ్రెస్​వి నిరాధార ఆరోపణలు: కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయం పేరుతో సభ పెట్టి ప్రధాని మోదీపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. బీజేపీ స్టేట్​ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పాలనలో సామాజిక న్యాయం కోసం ఏం చేశారో చెప్పకుండా.. కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. కాగా, హైదరాబాద్‌‌‌‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించింది సామాజిక న్యాయ సమరభేరి కాదని.. అన్యాయ సభ అని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు.