ఓయూకు ఇస్తామన్న  రూ.వెయ్యి కోట్లు ఎక్కడ..?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

ఓయూకు ఇస్తామన్న  రూ.వెయ్యి కోట్లు ఎక్కడ..?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీఆర్ఎస్ చీఫ్ కవిత
  • ప్రభుత్వానికి ఓయూ వీసీగులాం గిరి చేస్తున్నారని ఫైర్​
  • ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ స్పందించాలని విజ్ఞప్తి
  • బలమైన పోరాటాలు చేయాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్-టీచింగ్ ఉద్యోగుల శ్రమను, రక్తాన్ని దోచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి జాడలేకుండా పోయారని ధ్వజమెత్తారు. వీసీ ఉద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వానికి గులాం గిరి చేస్తున్నారని విమర్శించారు.

ఏడాదిన్నరగా ఉస్మానియా నాన్-టీచింగ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని, ఈ విషయంపై గవర్నర్ వెంటనే స్పందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నాన్-టీచింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కవిత, ఎంపీలు ఆర్. కృష్ణయ్య, ఈటల రాజేందర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హాజరై ఉద్యోగులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 35 ఏండ్లుగా ఉస్మానియాలో నాన్-టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అన్యాయం జరుగుతోందని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడడం క్షమించరాని నేరమన్నారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్లుగానే, ఉద్యోగి ఏడ్చిన యూనివర్సిటీ బాగుండదన్నారు.

ఉద్యోగులను వీసీ ఇబ్బంది పెడుతున్నారు..

ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే వారిని వీసీ ఇబ్బంది పెడుతున్నారని కవిత మండిపడ్డారు. ఉస్మానియాకు 105 ఏండ్లలో తొలిసారి మాదిగ బిడ్డను వీసీని చేశామని సీఎం గొప్పలు చెబుతున్నారని.. కానీ నిధులు ఇవ్వకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. అటానమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండి ఉద్యోగుల కోసం పోరాటం చేయాల్సిన వీసీ ప్రభుత్వానికి గులాం గిరి చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వం కోసం వర్సిటీ ప్రయోజనాలను తాకట్టు పెడితే చరిత్ర క్షమించదని వీసీని హెచ్చరించారు. ఏడాదిన్నరగా నాన్-టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించారు. ఓయూలో 85 శాతం లోకల్ వాళ్లనే నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ బిహార్, యూపీ వాళ్లను సెక్యూరిటీ కోసం నియమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలి.

సమస్య పరిష్కారం కోసం ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు పోరాటం చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.ఏటా ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నాన్-టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఖాదిర్, వెంకటేశ్, నాగరాజారావు, అక్బర్, పవన్, హైమావతి తదితరులు పాల్గొన్నారు.