ఇదేం కమిటీ.. ఇవేం ప్రశ్నలు..?.. ఎథిక్స్ కమిటీపై ఎంపీ మొయిత్రా మండిపాటు

ఇదేం కమిటీ.. ఇవేం ప్రశ్నలు..?.. ఎథిక్స్ కమిటీపై ఎంపీ మొయిత్రా మండిపాటు
  • అనైతిక ప్రశ్నలు అడిగారని ఫైర్​
  • విచారణ మధ్యలోనే వాకౌట్ చేసిన టీఎంసీ ఎంపీ
  • తప్పించుకునే ప్రయత్నమన్న చైర్మన్

న్యూఢిల్లీ: పార్లమెంట్​ ఎథిక్స్ కమిటీపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడ్డారు. అనైతిక ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ విచారణ మధ్యలోనే వాకౌట్​ చేశారు. ఆమెకు మద్ధతుగా ప్రతిపక్ష సభ్యులు కూడా బయటకు వచ్చేశారు. డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై విచారణలో భాగంగా మొయిత్రా గురువారం ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. అయితే, విచారణ మొదలైన కాసేపటికే మొయిత్రాతో పాటు మిగతా ప్రతిపక్ష సభ్యులు బయటకు వచ్చేశారు. అక్కడున్న మీడియాతో మొయిత్రా మాట్లాడుతూ.. ‘ప్యానెల్ పనితీరు నాకు వ్యతిరేకంగా ఉంది, కమిటీ చైర్మన్​ వినోద్ సోంకర్ అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగారు. ఇది ఎలాంటి సమావేశం, వ్యక్తిగత, నీచమైన ప్రశ్నలు అడిగారు’ అని అన్నారు. వాళ్లు ఇష్టం వచ్చిన అంశం ఎంచుకొంటున్నరు. చెత్తంతా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని కమిటీ సభ్యుడు ఒకరు అన్నారని, నా కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయా అంటూ మొయిత్రా విలేకరులను అడిగారు. కమిటీలోని కాంగ్రెస్ సభ్యుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్​ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొయిత్రాను కమిటీ చైర్మన్ అడిగిన ప్రశ్నలు అనైతికంగా ఉన్నాయని తెలిపారు.

విచారణ తప్పించుకోవడానికే.. వినోద్ సోంకర్​

క్రాస్ ఎగ్జామినేషన్​కు మొయిత్రా సహకరించలేదని, విచారణను తప్పించుకునేందుకే ఆమె వాకౌట్ చేశారని వినోద్ సోంకర్ విమర్శించారు. ‘మొయిత్రా ఎథిక్స్​ కమిటీకి, ఎంక్వైరీకి సహకరించలేదు. ప్రతిపక్ష సభ్యులు కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నరు. ప్రశ్నలను తప్పించుకునేందుకు సమావేశం నుంచి వాకౌట్ చేశారు’ అని అన్నారు. కమిటీలోని మరో సభ్యుడు, బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ అఫిడవిట్ గురించి అడిగినప్పుడు మొయిత్రా అహంకారంతో ప్రవర్తించారని చెప్పారు. తన పార్లమెంట్ లాగిన్ ఐడీని హీరానందానీకి ఇచ్చినట్లు అంగీకరించారు. అయితే దాని ద్వారా అడిగిన ప్రశ్నలు మాత్రం తనవే అని చెప్పినట్లు తెలిసింది.