GT vs CSK: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచులో గెలిచేదెవరు

GT vs CSK: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచులో గెలిచేదెవరు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 మార్చి 31న  ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, నాలుగుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య  ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది.  ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్...గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో గెలిచే జట్టేది..ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం..

పక్కా ప్రణాళికతో..

గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.  అయితే ఈసారి ఐపీఎల్ లో ధోని తన కెప్టెన్సీ మ్యాజిక్ ను మరోసారి రుచి చూపించాలనే  ధోని భావిస్తున్నాడు.  2022 ఐపీఎల్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలో మరోసారి అలాంటి ప్రదర్శన చేయాలని గుజరాత్ టైటాన్స్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో రెండు జట్లు పక్కా ప్రణాళికతో తొలి మ్యాచ్ లో ఆడబోతున్నాయి. 

రెండు జట్లలో కీలక ఆటగాళ్లు దూరం..

తొలి మ్యాచ్ కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలోని కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. టైటాన్స్‌కు చెందిన డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం  దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగే  రెండు వన్డేల్లో అతడు పాల్గొనబోతున్నాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత అతడు గుజరాత్ టైటాన్స్ తో  ఏప్రిల్ 2న కలుస్తాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కారణంగా ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు మహేశ్ తీక్షణ, మతీషా పతిరణలు తొలి మ్యాచ్ లో ఆడటం లేదు. 

పిచ్ , వాతావరణ నివేదిక

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్.. పక్కా బ్యాటింగ్‌ పిచ్.  ఇటీవలే ఈ పిచ్ పై  భారత్, ఆస్ట్రేలియా మధ్య  నాలుగో టెస్టు జరిగింది. ఇందులో భారీ స్కోర్లే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లోనూ భారీ స్కోర్లే నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ టీ20ల్లో  అత్యధిక స్కోరు  234/4 కాగా..అత్యల్ప స్కోరు 66/10. ఈ పిచ్ పై 10 టీ20 మ్యాచులు జరగ్గా..ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు..రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 160 పరుగులు కాగా..యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు 137 పరుగులు. మ్యాచ్ సమయంలో వాతావరణం పొడిగానే ఉంటుంది. మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సమయంలో 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అభిమానులు పూర్తిగా 40 ఓవర్ల పాటు మ్యాచును వీక్షించవచ్చు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే ఛాన్సుంది. 

తుది జట్లు అంచనా..

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా/కేఎస్ భారత్ (WK), శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మాథ్యూ వేడ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్/ఓడియన్ స్మిత్, మహమ్మద్ షమీ, ఆర్ సాయి కిషోర్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, MS ధోని (కెప్టెన్& వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, శివమ్ దూబే, దీపక్ చాహర్, సిమర్‌జీత్ సింగ్

బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద మ్యాచ్: రుతురాజ్ గైక్వాడ్

తొలి మ్యాచ్లో  చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్  రుతురాజ్ గైక్వాడ్ అత్యుత్తమ బ్యాటర్ అని  చెప్పవచ్చు. ఓపెనింగ్ చేయనున్న అతడు జట్టుకు శుభారంభాన్నిచ్చే అవకాశం ఉంది.  IPL 2022లో రుతురాజ్ 14 మ్యాచ్‌లలో 368 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ లో మరింత మెరుగ్గా రాణించాలని చూస్తున్నాడు.

బెస్ట్ బౌలర్ ఆఫ్ ద మ్యాచ్: మహ్మద్ షమీ

మహ్మద్ షమీ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తనదైన బౌలింగ్ తో బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెడతాడు. కొత్త బంతితో  వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో  టైటాన్స్‌ గెలుపులో షమీ ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాడు. 

గెలిచేదెవరంటే..

జట్ల బలాబలాలు..ఆటగాళ్ల ఫాం..పిచ్ కండీషన్స్ బట్టి..ఫస్ట్ మ్యాచ్లో  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.