వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా.. కోరుట్లలో కరెంటు తీగలు తగిలి ఘోర ప్రమాదం..

వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా.. కోరుట్లలో కరెంటు తీగలు తగిలి ఘోర ప్రమాదం..
  • 8 మందికి గాయాలు.. నలుగురికి సీరియస్​
  • వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా.. 
  • విద్యుత్​ వైర్లు తగలడంతో ప్రమాదం
  • స్థానికుల అప్రమత్తతో తప్పిన పెను ముప్పు

జగిత్యాల/కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు చనిపోయారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం (june 15) ఈ ఘటన చోటు చేసుకున్నది. విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా.. కరెంట్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోరుట్ల పట్టణంలోని మెట్​పల్లి రోడ్డులో శ్రీ బాలాజీ గణపతి విగ్రహాల తయారీ కేంద్రం ఉంది. 

ఆదివారం తయారు చేసిన వినాయకుడి విగ్రహం తడిగా ఉండటంతో.. దాన్ని ఆర బెట్టేందుకు కార్మికులు పక్కనే ఉన్న షెడ్డులోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పైన ఉన్న 33 కేవీ హై టెన్షన్ వైర్లు విగ్రహం పైభాగాన్ని తాకాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విగ్రహం తడిగా ఉండటంతో.. దాన్ని పట్టుకున్న 10 మంది షాక్​కు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు కర్రల సహాయంతో కార్మికులను పక్కకు నెట్టారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి కరెంట్ సరఫరా నిలిపివేయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 10 మందిని కోరుట్లలోని ఏరియా హాస్పిటల్​కు తరలించారు. 

వారికి ఫస్ట్​ ఎయిడ్ చేయించారు. పరిస్థితి విషమంగా ఉన్న అల్వాల వినోద్ (32), వెల్లుట్ల సాయి అలియాస్ బంటి (23)ని జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుడు వినోద్.. విగ్రహాల తయారీ కేంద్రం యజమానిగా పోలీసులు గుర్తించారు. అల్వాల నితిన్, వెంకట్​రెడ్డి, వెల్లుట్ల కృష్ణ, మహారాష్ట్రకు చెందిన సాయినాథ్, హన్మంతు, యూపీకి చెందిన ఆకాశ్ పున్నంగిరి, రోషన్, జగిత్యాలకు చెందిన ఎండీ అర్షద్ గాయపడ్డారు. వీరిలో ఆకాశ్, కృష్ణ, హనుమంతు, సాయినాథ్​ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​లోని నిమ్స్ కు తరలించారు. 

ఘటనా స్థలాన్ని జగిత్యాల ఎస్పీ అశోక్​ కుమార్ పరిశీలించారు. జిల్లా హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ సత్య ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జ్ జువ్వాడి నర్సింగ రావు హామీ ఇచ్చారు. మెట్​పల్లి రోడ్డులో 33 కేవీ కరెంట్ వైర్లు తక్కువ ఎత్తులో చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, వెంటనే సరి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ప్రజలు కోరారు.