అసైన్డ్​ భూములపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలె : ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

అసైన్డ్​ భూములపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలె : ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్
  • రాష్ట్రం రోజు రోజుకూ పేదరికంలోకి పోతోంది

పెద్దపల్లి, వెలుగు: ‘బతుకుదెరువు కోసం 20 గుంటల అసైన్డ్​భూమిని చదును చేసుకొని దున్నుకుంటే జైల్లో పెడతారా?  రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్​ భూములపై శ్వేతపత్రం రిలీజ్ ​చేయాలి’ అని బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండలంలో బుధవారం ప్రవీణ్​ కుమార్​పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం రోజు రోజుకూ పేదరికంలోకి పోతోందన్నారు. పెద్దపల్లిలో తనకు అడుగడుగునా పేదరికం కన్పించిందన్నారు. 

గ్రామాల్లో ఉన్న అసైన్డ్​భూములను పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటుంటే.. ప్రభుత్వం రైతులపై దాడులు చేసి గుంజుకుంటోందన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తోందన్నారు. పెద్దపల్లికి మంజూరైన బ్రిడ్జీలను కూడా నిర్మించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైకి చేరుకుందన్నారు. బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గం ఇన్​చార్జి దాసరి ఉష, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.