టీఆర్‌ఎస్‌‌లోకి పోయినోళ్లు వెనక్కి రాండ్రి

టీఆర్‌ఎస్‌‌లోకి పోయినోళ్లు వెనక్కి రాండ్రి

అది కుటుంబ పార్టీ..
కేసీఆర్​ది దోపిడీ పాలన: ఉత్తమ్
రాజకీయాలను భ్రష్టు పట్టించారు
హామీల అమలు ఏమైంది?
రిజర్వేషన్ల ప్రకటన, నామినేషన్స్​కు టైమివ్వరా అని ప్రశ్న

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ నుంచి టీఆర్​ఎస్​లోకి వెళ్లినవాళ్లు వెనక్కి రావాలని పీసీసీ  చీఫ్​ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కుటుంబ పార్టీ అని, కేసీఆర్‌‌‌‌ది దోపిడీ పాలన అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌‌‌‌ మాత్రమే బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వనపర్తికి చెందిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు, కార్యకర్తల బుధవారం గాంధీభవన్​లో ఉత్తమ్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, రాజకీయాలను సీఎం కేసీఆర్‌‌‌‌ భ్రష్టుపట్టించారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, రైతు బంధు.. ఎటుపోయాయని నిలదీశారు. మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో ఈ అంశాలనే తాము ప్రచారాస్త్రాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ‘‘మున్సిపల్‌‌‌‌ ఎన్నికల గురించి మాట్లాడితే నాపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌‌‌‌ భయపడుతోందని అంటున్నారు. కాంగ్రెస్‌‌‌‌కు అలాంటి భయమేంలేదు. నేను ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించాను. మున్సిపోల్స్‌‌‌‌ను ఎదుర్కోవడం మాకు సమస్య కాదు” అని ఉత్తమ్​ అన్నారు. వనపర్తి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత, మాజీ ఎంపీపీ శంకర్‌‌‌‌ నాయక్‌‌‌‌ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌‌‌‌ నుంచి వెళ్లి తప్పు చేశానని అన్నారు. తాను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఉన్న మూడేండ్లలో ఏ రోజూ సంతోషంగా లేనని చెప్పారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ఏ వర్గం కూడా ఆనందంగా లేదన్నారు. పదవులు ఇస్తామని పార్టీలోకి చేర్చుకొని తర్వాత కనీసమైన విలువ కూడా ఇవ్వలేదని, అందుకే ఆ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్​లోకి వచ్చినట్లు చెప్పారు. ఇతర నేతలు వెనక్కు వచ్చేయాలని ఆయన సూచించారు.

మున్సిపోల్స్​కు ఎందుకంత హడావుడి?

మున్సిపల్‌‌‌‌ ఎన్నికల విషయంలో అధికారులు అనవసరమైన హడావుడి చేస్తున్నారని ఉత్తమ్​ మండిపడ్డారు. రిజర్వేషన్ల ప్రకటనకు, నామినేషన్లకు మధ్య కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఆయన మీడియా చిట్​చాట్​లో అన్నారు. ఈ నెల 5న రిజర్వేషన్లు ప్రకటించి, 8వ తేదీ నుంచి నామినేషన్లు వేయమంటున్నారని, ఇది సాధ్యమా అని  ప్రశ్నించారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఆ జాబితా అంది, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, రిజర్వేషన్లకు అనుగుణంగా సర్దుబాట్లకు కొంత సమయం పడుతుందని ఉత్తమ్​ తెలిపారు. ఎన్నికలకు తాము భయపడడం లేదని, ప్రక్రియ కరెక్టుగా ఉండాలని మాత్రం కోరుతున్నామన్నారు. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత అభ్యర్థి క్యాస్ట్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. బీ ఫామ్‌‌‌‌ తీసుకొని నామినేషన్‌‌‌‌ వేసేందుకు రెండు రోజుల సమయం ఎట్ల సరిపోతుందని ప్రశ్నించారు. మున్సిపల్​ ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఉత్తమ్​ ఆరోపించారు. మున్సిపల్‌‌‌‌ చట్టంలో ఎన్నికల ప్రక్రియకు తగినంత సమయం ఇవ్వకూడదని ఏమీ లేదు కదా అని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ మాట విననందున హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశామని చెప్పారు. అది గురువారం విచారణకు వస్తుందని వివరించారు. మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ విజయం సాధిస్తుందని, దేశవ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పనైపోయిందంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దుయ్యబట్టారు.