న్యుమోనియా కేసులపై మరింత సమాచారం ఇవ్వండి .. చైనాను కోరిన డబ్ల్యూహెచ్‌వో

న్యుమోనియా కేసులపై మరింత సమాచారం ఇవ్వండి .. చైనాను కోరిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: దేశంలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, పిల్లల్లో న్యుమోనియా పెరిగిపోతుండటంపై తమకు సమాచారం ఇవ్వాలని చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ‘‘శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల గురించి నవంబర్ 13న చైనా నేషనల్ హెల్త్ కమిషన్‌లోని అధికారులు రిపోర్ట్ చేశారు. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల ఇలా జరిగిందని వారు చెప్పారు. వారం రోజుల తర్వాత ఉత్తర చైనాలో పిల్లల్లో న్యుమోనియా క్లస్టర్లను గుర్తించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

చైనా అధికారులు రిపోర్ట్ చేసిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు, పిల్లల్లో న్యుమోనియా లక్షణాలకు సంబంధం ఉందా? లేదా? వేరే కారణాలు ఉన్నాయా అనేది క్లారిటీ లేదు” అని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌లు, ఆసుపత్రులపై పెరిగిన భారం గురించి మరిన్ని వివరాలు ఇవ్వాలని చైనాను కోరినట్లు తెలిపింది. ఇంటర్నేషనల్ లీగల్ మెకానిజం ద్వారా ఈ సమాచారన్ని అడిగినట్లు చెప్పింది. 

నార్త్ చైనాలో ఆసుపత్రులు ఫుల్

ప్రస్తుతం నార్త్ చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో తక్కువ లక్షణాలు ఉన్న పిల్లలను క్లినిక్‌లు, ఇతర ఫెసిలిటీస్‌కు తీసుకెళ్లాలని ప్రజలను ఆరోగ్య అధికారులు కోరారు. బీజింగ్ పిల్లల ఆసుపత్రిలో ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌కు వస్తున్న పేషెంట్ల సంఖ్య రోజుకు 7 వేలకు పైనే ఉంటున్నది. ఇది ఆసుపత్రి కెపాసిటీ కంటే చాలా ఎక్కువ. పెద్ద ఆసుపత్రులకు భారీగా పేషెంట్లు వస్తున్నారని, చాలా పెద్ద క్యూలు ఉంటున్నాయని, దీంతో ఓ మోస్తరు లక్షణాలు ఉన్న పిల్లల్ని ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లకు తీసుకెళ్లాలని నేషనల్ హెల్త్ కమిషన్ సూచించింది.