బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు?

బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు?
  • 8 నుంచి అసెంబ్లీ సెషన్
  •  2 నెలలుగా ప్రకటించని కమలం పార్టీ
  •  పోటీలో నలుగురు ఎమ్మెల్యేలు
  •  బీసీలకు ఇస్తారంటూ ప్రచారం
  •  అదే జరిగితే పాయల్ శంకర్, రాజాసింగ్ కు చాన్స్
  •  సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తే మహేశ్వర్ రెడ్డికి..

హైదరాబాద్: కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. బీజేపీ ఇంతవరకు ఫ్లోర్ లీడర్ ఎవరన్నది ప్రకటించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. వీరిలో నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి, గోషామహల్ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది.

గత అసెంబ్లీ సెషన్ లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున ఎక్కువ సేపు మాట్లాడారు. దీంతో ఆయనకు బీజేఎల్పీ లీడర్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీ అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రమే బీసీలు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ సామాజికవర్గానికి చెందిన వారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు.

ఆ సమయంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. బీజేపీ నేతలు మిగతా పార్టీలకు సవాలు విసిరారు. దమ్ముంటే బీసీని సీఎం చేస్తామని ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించడంతో ఫ్లోర్ లీడర్ ఎవరన్న చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు రెండు నెలలు పూర్తయింది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీ తరఫున గళం వినిపించేందుకు ఫ్లోర్ లీడర్ అవసరం. అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్లను ప్రకటించినా.. బీజేపీ మాత్రం ఎవరో చెప్పలేదు. రెండు మూడు రోజుల్లో ఫ్లోర్ లీడర్ ను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. 

ఇంతకూ ఎవరికిస్తారు..?

రాజకీయ అనుభవం ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సామాజిక వర్గానికే కట్టబెట్టినట్లవుతుందనే చర్చ ఉంది. బీసీకి ఇవ్వాలని భావిస్తే పాయల్ శంకర్, రాజాసింగ్ రేసులో ఉంటారు. వారిలో రాజాసింగ్ కు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా.. తెలుగు భాష మీద పట్టులేకపోవడం, అసెంబ్లీ రూల్స్ పై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, స్థానిక అంశాలపై గణాంకాలతో సుదీర్ఘంగా ప్రసంగించలేరనేవి ప్రతిబంధకాలుగా మారనున్నాయి. దీనికి తోడు రాజధానిలో మూడో పవర్  పాయింట్ వస్తుందనే గుబులు కమలం పెద్దలకు పట్టుకుందని సమాచారం.

దీంతో ఆయనకు చెక్ పెడతారనే ప్రచారం ఉంది. ఆదిలాబాద్ కు చెందిన పాయల్ శంకర్ కు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు. అయితే పార్టీ  కోసం అంకిత భావంతో పనిచేశారనే చర్చ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి గానీ, పాయల్ శంకర్ కు గానీ దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.