మేధోమథనం ఎవరి కోసం? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి

మేధోమథనం ఎవరి కోసం? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి

‘తెలంగాణ  ఆకాంక్షలు నెరవేరాయి. 75 ఏండ్ల దేశ ఆకాంక్షలే నెరవేరలేదు. ఎనిమిదిన్నర ఏండ్ల తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోయింది. తెలంగాణలో అభివృద్ధి పురివిప్పి నాట్యం చేస్తున్నది. ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతున్నది. అన్ని వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి.  దేశం మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. నిరుద్యోగం పెరిగింది. రూపాయి పడిపోయింది. జీడీపీ పడిపోయింది. నియంతృత్వం పాలిస్తున్నది. అన్ని వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి.  మేధావులు, బుద్ధిజీవులు మేధోమథనం చేయకపోతే దేశం మరింత ఆగమవుతది’. ఈ మాటలు ఎక్కడో విన్నట్లున్నది కదా? దేశానికి మరో ప్రత్యామ్నాయంగా మారుతానంటున్న  నాయకుడి నుంచి విన్న మాటలే అవి.  దేశంలో ఫాసిజం, మతతత్వవాదానికి వ్యతిరేకంగా బుద్ధిజీవులు ఈ మధ్య మేధోమథనం జరిపినట్లుగా వింటున్నాం.  కానీ పైకి ఏమి చెప్పినా..  దేశంలో జాతీయపార్టీ నిర్మాణానికి కేసీఆర్​ కొందరు లెఫ్టిస్టు బుద్ధిజీవుల సహకారం తీసుకునే ప్రయత్నంలో భాగంగానే  మేధోమథన సదస్సులు జరుగుతున్నాయని ప్రజల భావన.  సహజంగా  జాతీయవాదులతో  లెఫ్టిస్ట్​లకు ఉండే వైరుధ్యాన్ని కేసీఆర్​ సొమ్ము  చేసుకోవాలనుకుంటున్నారని వింటున్నాం! అదే నిజమైతే ,ఎనిమిదేండ్లలో ఆ లెఫ్ట్​ బుద్ధిజీవులే కేసీఆర్​ బాధితులుగా బతికారు. వాళ్లే కొందరు ఇవాళ కేసీఆర్​కు తమ సేవలు అందిస్తుంటే..చూసే ప్రజలే నవ్వుకునే పరిస్థితి. 

ఇక్కడి ఫాసిజం సంగతి?

ఒకనాడు తమ ఇజాలు, వాదాలు పనికిరావన్న నాయకుడే, ఇపుడు తమ చేత మేధమథనం చేయిస్తున్నారని కొందరు బుద్ధిజీవులు గ్రహించలేకపోతున్నారా? తన పాలనలో ధర్నాలు ఉండవు, దరఖాస్తులూ ఉండవు అన్న పాలకుడు ఏం చేశాడో బుద్ధిజీవులకు తెలియదనుకోవచ్చా? ధర్నా చౌక్​లు మూసేసి, ఇంటి తలుపులు పగులగొట్టి  గృహ నిర్భందాలు జరిపిన నేలపైనే..ఇపుడు ఎవరి కోసం మేధోమథనాలు జరుపుతున్నారో, భారత్​ బచావో  అనే కొత్త పల్లవి అందుకుంటున్నారో సామాన్యుడికి తెలియని విషయం కాదు. ఇల్లు చక్క బెట్టనివాడు, ఊరును చక్కబెట్టడానికి పోయినట్లు లేదా? రాష్ట్ర భక్షణ కానని వాడు, దేశ రక్షణ గురించి మాట్లాడటం  వింటే ఎవరికైనా విడ్డూరంగానే ఉంటది. మొత్తంమీద తెలంగాణ సోకాల్డ్​ బుద్ధిజీవులు మేధోమథనం మాత్రం మొదలుపెట్టారు. బుద్ధిజీవులంతా  ఒకే రకంగా లేకపోవచ్చు. అందులో ఇల్లు చక్కబెట్టి, ఊరు చక్కబెడదాం అనేవాళ్లూ ఉన్నారు. వాళ్లతో సమస్యలేదు. కానీ ఇల్లు బాగుంది, ఊరే బాగలేదు అంటున్న కొందరికి పాలకుడి సేవనే పరమార్థమైపోయింది. దేశంలో ఫాసిజం పెరిగిపోయిందనే బహానా మరింత బాగుంది. కానీ, నడిబజార్లో అడ్వకేట్​ దంపతుల హత్య, ఇసుక లారీల హత్యలు, కుకునూరుపల్లి  ఆత్మహత్యలు, ఇసుక దందా, భూదందా ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రతీకలు కావచ్చేమో? భారత్​ బచావో లో  వీటికీ మినహాయింపు ఉందేమో? ఇంతకీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉందనుకోవాలో, లేదనుకోవాలో ముందు మేధోమథనంలోనే  తేల్చాల్సిన విషయం! దేశ ప్రధానిని ఆహ్వానించడానికి కూడా నిరాకరిస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిది ఫాసిజమా, ప్రజాస్వామ్యమా? దీనికి జవాబు చెప్పలేని వారు దేశాన్ని ఫాసిజం పాలిస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిలో చూడలేని ఫాసిజాన్ని, దేశంలో ఎలా చూడగలుగుతున్నారు? 

వచ్చిన తెలంగాణ ఎవరి కోసమైంది?

వచ్చిన తెలంగాణ కేసీఆర్​ కోసమే తప్ప, అది ప్రజల కోసం కాలేకపోయిందని ఎనిమిదేళ్లలో అడుగడుగునా నిరూపితమైనా కూడా.. కొందరికి  తెలంగాణలో ఫాసిజం కనిపించదు. అంతా ప్రజాస్వామ్యమే కనిపిస్తుంది. తెలంగాణ తెచ్చుకోవడంలో ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. అవన్నీ కేసీఆర్​ సొంతమైనాయి తప్ప ప్రజల సొంతం కాలేదని మొన్నటిదాకా చెప్పిన బుద్ధిజీవులు సైతం కొందరు ఇవాళ తెలంగాణ ఆకాంక్షల సంగతి గాలికొదిలేసి, ఇక దేశ ఆకాంక్షల కోసం బయలుదేరడం చూస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణ కుటుంబపాలనగా మారితే అది ఫాసిజం కాదు.  ‘నేను ప్రగతిభవన్​లో కూర్చొని  ప్రజల కోసమే ఆలోచిస్తుంటాను, ఇక  ప్రజలను కలవడం దేనికి? ప్రజాదర్బార్​లు దేనికి? ’ అన్న పాలకుడు దొరకడమూ  ప్రజల భాగ్యమే!  ప్రజల కోసం పాలన మర్చిపోయాం. పాలకుడి కోసమే పరిపాలన. పాలకుడి కోసమే  ప్రభుత్వం. పాలకుడి కోసమే రాజకీయం.  తొమ్మిదేండ్లలో జనం అనుభవం అది! రాజకీయ ఎత్తులు, జిత్తులు, కొనుగోళ్లు, శత్రువులపై బ్లేమ్​ గేమ్​లతో పాలనా కాలమంతా ఖర్చయిపోయింది. ప్రజలు పాలకుడిలో  పరిపాలనా దక్షతను కోరుకుంటారు. గుడ్​ అడ్మినిస్ట్రేటర్​ ను కోరుకుంటారు. కానీ ఏకపక్షంగా ప్రజలను కలవడానికే ఇష్టపడని పాలకుడిని బహుశా ఈ దేశంలో ఎక్కడా చూసి ఉండము. ఏ నిర్ణయమైనా, తన కోసం తప్ప, ప్రజల కోసం అనేది తన పొలిటికల్​ డిక్షనరీలోనే ఉండదు. కొందరు బుద్ధిజీవుల దృష్టిలో ఇది ఫాసిజం కాదేమో?  అభివృద్ధి, సంక్షేమాలను కాడెడ్లలాగ నడుపుతున్నామని చెప్పుకోవడమూ ఒక  లాజికే​. అభివృద్ధి  అనేది పాలకుడి కలలపై ఆధారపడుతుంది తప్ప అందులో ప్రజల కలలేమీ ఉండవు!   కాళేశ్వరం పాలకుడి కల! 18 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు.  లక్ష ఎకరాలైనా సాగు పెరిగిందా? ఫ్లోరైడ్​ ప్రాంతాల్లో నూ ప్రజలు ఇప్పటికీ మినరల్​ వాటర్​ కొనుక్కొని తాగుతున్నారు. మిషన్​ భగీరథకు మాత్రం 40 వేల కోట్లు ఖర్చుచేశాం.  ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల కోసమా, ప్రజల కోసమా? ఇప్పటికీ అంతుబట్టని విషయమే. పాలకుడే ఇంజనీరుగా అవతరించాక నిపుణులతో సలహాలు, సూచనలు ఎక్కడ?  ప్రజాభిప్రాయానికి చోటెక్కడ?   పాలకుడి ఇష్టాయిష్టాలే  ప్రజల అదృష్టానికైనా, దురదృష్టానికైనా గీటురాయి!  తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి వ్యయం సుమారుగా మూడు లక్షల కోట్లు. దాని ఫలితాలు ఎక్కడున్నాయో తెలియదు. కానీ  రోజూ రైతు ఆత్మహత్యల వార్తలు మాత్రం చదవాల్సిందే.    పరిపాలనా కాలమంతా రాజకీయ క్రీడలకే ఖర్చయిపోయింది.   ఇక ప్రజా పాలనకు సమయం ఎక్కడ?  ఇవి మేధోమథనం ఎజెండాలో ఉన్నాయో లేదో తెలియదు మరి!

వ్యూహం తిరగబడే అవకాశాలు

 తెలంగాణది దేశంలోనే ఒక ప్రత్యేక పరిస్థితి. ఆ పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన జరగలేదనేదే ఇక్కడి ప్రజల ఆరోపణ. అవినీతి, వ్యవస్థలను చెరపట్టి శాసించిన ఎనిమిదిన్నర ఏండ్ల పాలన ఇక్కడి ప్రజల ఆలోచనలను మార్చేస్తున్న క్రమంలో పాలకుడు కొత్త రాజకీయ ఎత్తుగడలను ఆశ్రయిస్తున్నారు. ఇజాలు, వాదాలతో సరికొత్త రాజకీయాన్ని పురికొల్పే ప్రయత్నమది. అది వర్కవుటయ్యే పరిస్థితులు మాత్రం లేవనే చెప్పాలి. ఎందుకంటే, విశ్వసనీయత కోల్పోయిన పాలకుడి వ్యూహాలు పదే పదే పనిచేయవు. అవి తిరగబడే అవకాశాలే ఎక్కువ. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా, ఇజాలు, వాదాలకు  అతీతంగా  తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సమీకృతమవుతున్నది.  లెఫ్ట్​, రైట్​, సెంట్రిస్ట్​ అనే తేడా లేకుండా  మార్పును కోరుకుంటున్న రాజకీయం బలపడుతున్న క్రమం ఇది.  ఇజాలకు అతీతంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్​ అవుతున్నది. కొందరు బుద్ధిజీవుల చేత దాన్ని విచ్ఛిన్నం చేయాలనే పాలకుడి ప్రయత్నం ఫలించేనా? అది  సాధ్యం కాదని పరిస్థితులే చెపుతున్నాయి.

ఇజాలు, వాదాలు ఇంతకాలం ఏమైనాయి?

 కేంద్రం దేశాన్ని అమ్మేస్తున్నదంటాం. కానీ ఇక్కడ  భూములు అమ్ముతుంటే  మాత్రం తెలంగాణను అమ్మేస్తున్నట్లుగా కొందరు బుద్ధిజీవులకు కనిపించదు. ఇక్కడి ప్రైవేటీకరణ ముద్దే. అక్కడి ప్రైవేటీకరణ మాత్రమే దేశానికి అనర్థం. ఇజాలు, వాదాలను బట్టి భాష్యాలు చెప్పేవాళ్లే మేధోమథనాలు మొదలుపెట్టారు. ఫాసిజం, లౌకికవాదం వంటి పడికట్టుపదాలు మన రాజకీయాలకు కొత్తేమీ కాదు. కుహనా లౌకికవాదమే దేశంలో జాతీయవాదాన్ని బలోపేతం చేసిందనే విషయాన్ని ఇప్పటికీ కొందరు  మర్చిపోతున్నారనే చెప్పాలి. అయినా కేసీఆర్​ పాలనలో  ఏ ఇజం బతికిందని? ఇవాళ జాతీయవాద రాజకీయానికి వ్యతిరేకంగా వామపక్ష మేధోమథనాన్ని  ఉసిగొల్పుతున్నారు? అన్ని ఇజాలను పాతరపెట్టి ఎనిమిదిన్నరేండ్లు పాలించిన వైనాన్ని ఆ బుద్ధిజీవులు మర్చిపోయినా, ఇందిరా పార్కు మర్చిపోదుకదా? రాష్ట్ర పాలకుడి ఫాసిజం కొత్త రాష్ట్రానికి అనర్థంగా మారిందనే ఆలోచనే లేని వారు, కేంద్ర పాలకుడి ఫాసిజం గురించి మాట్లాడితే తెలంగాణలో ఎవరైనా ఎలా నమ్ముతారు?

- కల్లూరి శ్రీనివాస్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్