
భగవంతుడు నిర్వికారుడు. ...మనుషులు తమ ఊహలకు, నమ్మకాలకు అనుగుణంగా ఊహించుకుంటారు. కొందరు భగవంతుడు ఒక వ్యక్తిలా ఉంటాడని, మరికొందరు శక్తిలా ఉంటాడని, మరికొందరు విశ్వంలా ఉంటాడని భావిస్తారు . అయితే వాస్తవానికి ఆయనలో ఎలాంటి మార్పులు ఉండవు, ఆయన ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారు. ఆయనకు రూపంకాని ఏ విధమైన పరిమితులు కాని లేవు . అయితే భగవంతుడు ఏ మార్పులకు లోనవడు. అతనికి పుట్టుక, చావు, వృద్ధాప్యం వంటివి ఉండవని పండితులు చెబుతున్నారు.
భగవంతునికి నిర్దిష్టమైన రూపంకాని ఆకారం కాని ఉండదు. ఆయన సర్వాంతర్యామి అన్నిచోట్లా ఎల్లప్పుడూ.. శాశ్వతంగా అన్ని జీవులలోనూ ఉంటాడు. ఇక తన భక్తులను ప్రేమిస్తాడు ... రక్షిస్తాడు.అంటే భగవంతుడు ఒక వ్యక్తిలాగా కనిపించడు. అతని గుణాలు కూడా మారవు. ఎల్లప్పుడూ పరిపూర్ణంగా, సర్వశక్తిమంతుడుగా.. నిరాకారుడిగా ఉంటాడు
నిరాకారుడిని ధ్యానించడం, పూజించడం... సామాన్యుడికి సాధ్యం కాదు.. కనుక నిర్వికార బ్రహ్మను తపస్సు ద్వారా .. ఋషులు దర్శించి రూపకల్పన చేశారు. విశ్వశక్తిని కొన్ని బీజాక్షరాల ద్వారా యంత్రంలో నిక్షిప్తం చేసి దేవాలయాల్లో ఉండే మూల విగ్రహం క్రింద యంత్రాన్ని ప్రతిష్టించి, దాని మీద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
విశ్వశక్తి ఒకేచోట స్థిరంగా ఉండటం కోసం దేవాలయాల నిర్మాణం ఎక్కడ ఎలా ఏమి నిర్మించాలో, ఎలా నిర్మించాలో లెక్కించి, ఆగమ శాస్త్రంలో రుషులు వివరించారు. ఆ పద్దతినే ఇప్పటికి దేవాలయాల నిర్మాణానికి వాడుతున్నారు.. దేవాలయంలో నాలుగు ప్రక్కలా బలిపీఠం ద్వారా ఆయా ప్రదేశాలలో ఉన్న అదృశ్య శక్తులకు... పక్షులకు ఆహారాన్ని మూడు పూటల అందిస్తున్నారు.
అంతటి శక్తి కలిగిన దేవాలయాలలోకి ప్రవేశించగానే మనసులో ఒక రకమైన శాంతి లభిస్తుంది. కోరిన కోర్కెలు తీరుతున్నాయి. దైవం అంటే తెలియని సామాన్యులకు దైవ దర్శనం, దైవాన్ని దర్శించిన వారికి భక్తి, భక్తి కలిగిన వారికి ముక్తి లభించడం దేవాలయ దర్శనం ముఖ్య లక్ష్యం. అలాంటి దేవాలయాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో, దానిని రక్షించడం కూడా అంతే ముఖ్యం కదా మరి..!
దైవం నాకు గుడి కావాలని అడగలేదు. మన కోసం మనమే నిర్మించున్నాం. కాబట్టి మనమే కాపాడుకోవాలి. నాకోసం గుడి కట్టాడు అని కరుణించడం, నా గుడిని కూల్చాడు అని శపించడం దైవానికి సంబంధం లేదు. ఇంత సృష్టిని రక్షించే వాడికి గుడిని రక్షించుకోవడం తెలీదా! అని కొందరు మేధావులు వాదిస్తూ ఉంటారు. పరమాత్మ నాకోసం దేవాలయం కట్టమని చెప్పలేదు... కూల్చమని చెప్పలేదు.
భగవంతుడు అదృశ్య శక్తులను సృష్టించాడు. సృష్టి అంటు మంచి చెడుల మిళితం. ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి మనకి అసలు అర్హత లేదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకపోవడం మంచి, హాని కలిగించడం చెడు. ఇవి రెండు సరిసమానంగా ఉంటేనే సృష్టి సవ్యంగా సాగుతుంది. అందుకే దేన్నీ పూర్తిగా పరమాత్మ తీయడు. ఎవరైన ఇతరులకు చెడు చేసినా.. అలాంటి వారికి వత్తాసు (Support) పలికిన వారిని మాత్రమే నాశనం చేస్తాడు. ఎందుకంటే సామాన్యుడు ఏది ఎక్కువగా ఉంటే అటే మొగ్గు చూపుతాడు కదా..!
మంచి ఉంటే మంచి వైపు, చెడు సంస్కారం ఉంటే చెడు వైపు వెళతాడు. ఈ సృష్టిలో ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది. మంచివారికి ముక్తి .. మోక్షం లభించినట్లు... చెడ్డవాడికి అతని పాపకర్మల ఫలితంగా జన్మ లభిస్తుంది. ముక్తిని అందరూ పొందడం ఎలా సాధ్యం... కాదో చెడు చేయడం కూడా అందరికీ సాధ్యం కాదు. సృష్టిలో అందరూ జీవించాలి. పుట్టిన దగ్గర నుండి ఎవరి సంస్కారానికి తగ్గట్టు వారు బ్రతకాలి. ఇది సృష్టి నియమం. అందుకే అందరూ ఇక్కడ చెలామణి అవుతున్నారు..
ఉదాహరణకు ఒక భవవాన్ని కట్టినప్పుడు మంచి జరిగితే.. దానిని కూల్చినప్పుడు చెడు జరగదా ... అంటే కచ్చితంగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉండే శక్తుల ప్రభావం ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కానీ నిర్వికార బ్రహ్మ కు సంబంధం లేదు. అక్కడ ఏర్పాటు చేసిన శక్తి చెడు చేసిన వారిపై ప్రభావం చూపుతాయి. విద్యుత్ తీగలో శక్తి బయటికి కనబడదు. పట్టుకుంటే దాని ప్రభావంతో మృత్యువాత పడినట్లు ... దేవాలయాలలో ఉండే అదృశ్య శక్తుల ప్రభావం వల్ల మంచి చెడు రెండు జరుగుతాయి. ఇలాంటి అదృశ్య శక్తులను భగవంతుడు సృష్టిస్తాడు..