Niranjan Shah Cricket Stadium: రాజ్‌కోట్ క్రికెట్ స్టేడియానికి నిరంజన్ షా పేరు.. ఎవరితను?

Niranjan Shah Cricket Stadium: రాజ్‌కోట్ క్రికెట్ స్టేడియానికి నిరంజన్ షా పేరు.. ఎవరితను?

గుజరాత్‌లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటైన సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం పేరు మార్చారు. దేశంలోని అత్యంత సీనియర్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్లలో ఒకరైన బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా పేరు దానికి పెట్టారు. ఇకమీదట దానిని నిరంజన్ షా ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలువనున్నారు. భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నిర్ణయం తీసుకుంది.

ఎవరీ నిరంజన్ షా..?

నిరంజన్ షా 1965/66 నుండి 1974/75 వరకు సౌరాష్ట్ర తరపున 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఈ ప్రయాణంలో అతని క్రికెట్ కెరీర్ ముగియకముందే 1972లో  సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి పదవిని చేపట్టారు. అలా ఆయన దాదాపు మూడు దశాబ్దాలు ఆ పదవిలో కొనసాగారు. బీసీసీఐ గౌరవ కార్యదర్శిగానూ నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్) వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. గతంలో నిరంజన్ షా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చైర్మన్‌గానూ ఉన్నారు.

పూజారా, జడేజా

సౌరాష్ట్ర ప్రాంత క్రికెట్ అభివృద్ధికి నిరంజన్ షా చాలా కృషి చేశారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లైన చతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్ వంటి వారూ సౌరాష్ట్ర నుంచి వచ్చినవారే. సౌరాష్ట్ర స్టేడియం మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. తొలిసారి 2013లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది.

మూడో టెస్ట్

ఇదే వేదికపై భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 40 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(10), శుభ్ మాన్ గిల్(0), రజత్ పటీదార్(5) నిరాశపరచగా.. రోహిత్ శర్మ(73 నాటౌట్), రవీంద్ర జడేజా(47 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్ ద్వారా యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ భారత జట్టు టెస్టుల్లో అరంగ్రేటం చేశారు.

Also Read : స్టన్నింగ్ క్యాచ్‌తో షాక్‌కు గురి చేసిన SRH ప్లేయర్