కేసీఆర్ తిట్టిన తిట్లను ఆంధ్ర ప్రజలు మరిచిపోరు

 కేసీఆర్ తిట్టిన తిట్లను ఆంధ్ర ప్రజలు మరిచిపోరు
  • సొంత రాష్ట్రంలో పార్టీకి ప్రెసిడెంట్‌‌ని ప్రకటించనేలేదు
  • పోలవరంపై కేసీఆర్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్
  • కానీ పక్క రాష్ట్రానికి అధ్యక్షుడంట.. ఇదీ బీఆర్ఎస్ తీరు: సంజయ్
  • ఉద్యమ సమయంలో కేసీఆర్ తిట్టిన తిట్లను ఆంధ్ర ప్రజలు మరిచిపోరు
  • ఏ ముఖం పెట్టుకొని అక్కడికి పోతరు


​​​​​​హైదరాబాద్ : బీఆర్ఎస్‌‌కు జాతీయ అధ్యక్షుడెవరో చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే.. ఆయన రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని ప్రకటిస్తారు. కానీ బీఆర్ఎస్‌‌కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేరు. సొంత రాష్ట్రంలో పార్టీకి ప్రెసిడెంట్‌‌ను ప్రకటించకుండానే.. పక్క రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ తీరు’’ అని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో  కేసీఆర్ తిట్టిన తిట్లను ఆంధ్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని, అలాంటి కేసీఆర్ ఇవాళ జాతీయ పార్టీ పేరుతో ఏపీలోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నించారు. 

పెండ బిర్యానీ అంటూ కేసీఆర్ ఆంధ్ర వంటకాలపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన సంజయ్.. ఇప్పుడు ఆంధ్రవాళ్లే కేసీఆర్‌‌కు అవి తినిపించాలన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌లో ఆంధ్ర వాళ్లు చేరలేదని, కేసీఆరే వంద కార్లను ఏపీకి పంపించి వాళ్లను పిలిపించుకొని పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని కలవకుండా 4 గంటల పాటు నిలబెట్టడంతో అందులో ఇద్దరు వెళ్లిపోగా.. మిగిలిన ముగ్గురికీ పార్టీ కండువాలు కప్పారని విమర్శించారు. పార్టీలో చేరకముందే ఇలా చేస్తే.. చేరిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుకుంటున్నారని సంజయ్ చెప్పారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి గెలిచారని, మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల తర్వాత నీళ్ల వాటా పేరుతో ఏపీ, తెలంగాణ అని మళ్లీ రెచ్చగొడుతారని ఆరోపించారు. తెలంగాణ పేరును కేసీఆర్ మరిచిపోయారని, సోమవారం నాటి మీటింగ్ లో ఒక్కసారి కూడా జై తెలంగాణ అని అనలేదని గుర్తు చేశారు.

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్​ ఎక్కడిస్తున్నరు

రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నారా అని బండి సంజయ్ నిలదీశారు. ‘‘రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచింది నిజం కాదా? డిస్కంలకు 20 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉన్నా.. ఎందుకు చెల్లించడం లేదు? డిస్కంలు రూ.60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నది నిజం కాదా?’’ అని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులు తమ భవిష్యత్ ఏమిటనే ఆందోళనలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే.. రాష్ట్రం ఏర్పడ్డాక 23 లక్షలకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ నిధులను దొంగిలించిన దొంగ కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం నుంచి రికవరీ చేయించేందుకు కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. ఈ విషయంలో ఊరుకునేది లేదని సంజయ్ హెచ్చరించారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు

స్కూల్ ఎడ్యుకేషన్‌లో 21వ స్థానం, నిరుద్యోగంలో 4వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 5వ స్థానంలో తెలంగాణ ఉందని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కేసీఆర్.. ఇక దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ఫైర్ అయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో కుట్ర దాగి ఉందని, యూత్​ను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.30 వేల కోట్ల ఖర్చు అయితే దానికి లక్షా 30 వేల కోట్లకు పెంచుకొని ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని, పంపులు మునిగిపోయాయని, అలాంటి దానికి తానే ఇంజినీర్‌‌నని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని సంజయ్​ ఆరోపించారు.

పోలవరం ఎత్తు పెంచాలా? తగ్గించాలా?

విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణలోని నిజాం చక్కెర ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించడం లేదు. పోలవరంపై కేసీఆర్ వైఖరేంటో స్పష్టం చేయాలి. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో చెప్పాలి. ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. ఆర్టీసీని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు. లిక్కర్ ద్వారా రూ.44 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. పథకాలకు పోను, ఇంకా రూ.17 వేల కోట్లు మిగులుతున్నాయి. ఆ డబ్బంతా ఎక్కడికి పోతున్నది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ ఎందుకివ్వడం లేదు.