66 మంది పిల్లల మృతి.. ఆ టానిక్లపై దర్యాప్తు

66 మంది పిల్లల మృతి.. ఆ టానిక్లపై దర్యాప్తు

భారత్లోని మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారుచేసే నాలుగు దగ్గు, జలుబు సిరప్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అలర్ట్ జారీ చేసింది. గాంబియా దేశంలో ఇటీవల చోటుచేసుకున్న 66 మంది పిల్లల మరణాలతో ప్రో మెథజైన్, కోఫెక్స్ మాలిన్, మాకాఫ్, మాగ్రిప్ ఎన్ అనే సిరప్ లకు సంబంధం ఉండొచ్చని హెచ్చరించింది. చనిపోయిన పిల్లల్లో కిడ్నీ సంబంధిత సమస్యలను గుర్తించామని వెల్లడించింది. ఇప్పటివరకైతే ఆ నాలుగు సిరప్ ల భద్రత, నాణ్యతలకు సంబంధించి మెయిడెన్ ఫార్మా కంపెనీ తమకు ఎలాంటి పూచీకత్తులు సమర్పించలేదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

‘‘ఆ సిరప్ ల శాంపిళ్లను ల్యాబ్ లో పరీక్షించగా వాటిలో పరిమితికి మించిన మోతాదులో డై ఇథైలీన్ గ్లైకోల్, ఈథైల్ గ్లైకోల్ ఉన్నట్లు తేలింది. ఆ సమ్మేళనాలను అధిక మోతాదులో తీసుకోవడం మనిషి ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం. వాటి దుష్ప్రభావం వల్ల కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, మూత్రం రాకపోవడం, తలనొప్పి, మానసిక ఆందోళన, కిడ్నీ సమస్యలు చుట్టుముట్టే ముప్పు ఉంటుంది’’ అని వివరించింది.

ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు మృతిచెందడం అత్యంత బాధాకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ పేర్కొన్నారు. దీనిపై భారత్ లోని మెయిడెన్ ఫార్మా కంపెనీ, ఔషధ నియంత్రణ సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  ఎక్కువ మోతాదులో డై ఇథైలీన్ గ్లైకోల్, ఈథైల్ గ్లైకోల్ ఉన్న ఆ నాలుగు సిరప్ లను మెయిడెన్ ఫార్మా కంపెనీ నుంచి కేవలం గాంబియా దేశానికి మాత్రమే సరఫరా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. అయితే ఈ సిరప్ లు గాంబియా నుంచి  ఆఫ్రికాలోని ఇతరత్రా దేశాలకు అనధికారికంగా చేరి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రోగుల  ఆరోగ్య భద్రత దృష్ట్యా  అన్ని దేశాలు ఈ సిరప్ లను గుర్తించి వినియోగంలో లేకుండా చూడాలని కోరారు.