ఆర్టీఐ చీఫ్ కమిషనర్ ఎవరు ?..

ఆర్టీఐ చీఫ్ కమిషనర్ ఎవరు ?..
  • ఆర్టీఐ చీఫ్ కమిషనర్ ఎవరు ?
     
  • సీఎంవో కనుసన్నల్లోనే భర్తీ ప్రక్రియ!
  • ఓపెన్ నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్లకు ఆహ్వానం
  • పలువురు జర్నలిస్టులతో దరఖాస్తు చేయించిన అధికార పార్టీ పెద్దలు
  • చీఫ్ కమిషనర్ పోస్టుకు 15, కమిషనర్ల పోస్టుకు 250 దరఖాస్తులు
  • గతంలో సానుకూల మీడియా జర్నలిస్టులకు అందలం

హైదరాబాద్ : సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టుకు ఈ సారి ఓపెన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. చీఫ్ కమిషనర్, ఐదు కమిషనర్ పోస్టులకు ప్రభుత్వం గత నెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. చీఫ్ కమిషనర్ పోస్టుకు 15 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రగతిభవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సీఎం కేసీఆర్ ఉచ్చరించే ఇంగ్లీష్ దినపత్రిక జర్నలిస్టు పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. సీఎంవో సూచన మేరకే ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

సీఎంవో హామీతో ఓ న్యూస్ చానల్ నుంచి బయటికి వచ్చిన జర్నలిస్ట్ కూడా దరఖాస్తు దారుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీ సొంత మీడియాలో పనిచేస్తున్న మరో జర్నలిస్టు సైతం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ప్రధాన పత్రిక బ్యూరో చీఫ్ సీఎంవో సూచన మేరకు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరిని చీఫ్ కమిషనర్ గా నియమిస్తారు..? కమిషనర్లుగా ఎవరికి అవకాశం కల్పిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో చీఫ్ కమిషనర్లుగా రాజా సదారాం, బుద్ధామురళి నిర్వహించారు. ఇందులో రాజా సదారాం అసెంబ్లీ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాగా బుద్ధామురళి జర్నలిస్టు.. కమిషనర్లుగా వ్యహరించిన కట్టా శేఖర్ రెడ్డి నమస్తే తెలంగాణ సంపాదకుడిగా పనిచేశారు. మరో కమిషనర్ నారాయణరెడ్డి టీ న్యూస్ సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. మిగతా ఇద్దరు న్యాయవాదులు, మరొకరు విద్యావేత్త. ఈ సారి చీఫ్ కమిషనర్ గా ఎవరికి అవకాశం కల్పిస్తారు.. కమిషనర్లుగా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.