ప్రమాదం విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారు ?

ప్రమాదం విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారు ?
  • పాలమూరు ప్రాజెక్టు ప్రమాదంపై నాగం జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిన ప్రమాదం విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘పాలమూరు ప్రాజెక్టులో నవయుగ కంపెనీ టెండర్ వేసింది. పనులు మాత్రం మేఘా కంపెనీ చేస్తున్నది. మరి ప్రమాదం విషయంలో ఎవరిపై కేసులు నమోదు చేస్తారు” అని నిలదీశారు. ఆదివారం నాగర్ కర్నూల్‌‌లోని తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌‌‌తో లోపాయికారిగా మేఘా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుని నవయుగ కంపెనీ పేరుతో పనులు చేస్తున్నదని, ఇప్పటివరకు పదిమందికి పైగా మృత్యువాత పడ్డారని ఆరోపించారు. 54 నెలల్లోగా పనులు పూర్తి చేయాల్సి ఉందని, కానీ ఇప్పటిదాకా 50 శాతం కూడా పనులు చేయలేదన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు డిజైన్ మార్చి అండర్ గ్రౌండ్‌‌గా మార్చి పనులు ప్రారంభించారని, రీ డిజైన్ సక్సెస్ కాదని తాను అప్పట్లోనే చెప్పినప్పటికీ పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడమేంటని ఫైర్ అయ్యారు. 8 ఏళ్లుగా సంపాదించడమే తప్ప ప్రజలకు సేవ చేసింది లేదని, ఇప్పుడైనా ప్రజల్లోకి రావాలని సూచించారు.