ఓట్ల చీలికతో ఫాయిదా ఎవరికి?

ఓట్ల చీలికతో ఫాయిదా ఎవరికి?
  • ప్రధాన పార్టీలకు బీఎస్పీ, వైఎస్సార్​టీపీ, జనసేన, టీజేఎస్​ల టెన్షన్ 
  • వాటికి పోలయ్యే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయోనని పరేషాన్

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు చీల్చే ఓట్లతో ఎవరు లాభ పడతారు? ఎవరు మునుగుతారోనన్న చర్చ ప్రధాన రాజకీయ పార్టీల్లో మొదలయ్యింది. ముఖ్యంగా బీఎస్పీ, వైఎస్సార్​టీపీ, జనసేన, టీజేఎస్​టీడీపీలు చీల్చే ఓట్లు ఏ పార్టీలకు మేలు చేస్తాయి.. ఏ పార్టీల పుట్టి ముంచుతాయనే దానిపై లెక్కలు వేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్​తో జట్టు కట్టడం దాదాపు ఖాయమని చెప్తున్నారు. ఒకవేళ సీట్లు సర్దుబాటు కాకుంటే సీపీఐ, సీపీఎం విడిగా పోటీ చేస్తే ఆ ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే దానిపైనా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ఏ పార్టీకి ఏ మేరకు ఓట్లు రావచ్చు అనే దానిపై ఎక్స్ పర్ట్ లు దృష్టి సారించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ తప్పదని అంచనా వేస్తున్నారు. గ్రేటర్​హైదరాబాద్​తో పాటు ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం ఉండగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్​పటిష్టంగా కనిపిస్తోంది. త్రిముఖ పోటీ ఉన్న చోట్ల చిన్న పార్టీలకు పోలయ్యే ఓట్లే విజేతలను నిర్ణయించే పరిస్థితి నెలకొంది. 

టీజేఎస్ ఎఫెక్ట్ ఏ పార్టీపైనో..   

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్​కోదండరామ్​నేతృత్వంలోని తెలంగాణ జన సమితితోనూ కాంగ్రెస్​చర్చలు జరుపుతోంది. ఒకవేళ పొత్తు కుదరకపోతే.. టీజేఎస్ అభ్యర్థులను పోటీకి దించితే ఉద్యమకారుల ఓట్లకు కొంతమేరకు గండిపడొచ్చు. అదే జరిగితే ఆ ప్రభావం ఎవరిపై పడుతుందని ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. 

కాంగ్రెస్​తో లెఫ్ట్ పొత్తు దాదాపు ఖరారు 

సీపీఐ, సీపీఎం మొదట బీఆర్ఎస్​తో కలిసి పోటీ చేయాలనుకున్నా కేసీఆర్ వారికి అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కామ్రేడ్లు కాంగ్రెస్​తో జట్టు కడుతున్నారు. ఈ పొత్తు దాదాపు ఖరారు అయినట్టుగా మూడు పార్టీల నాయకులు చెప్తున్నారు. ఉభయ కమ్యూనిస్టులు ఐదేసి ఎమ్మెల్యే సీట్లు డిమాండ్​చేస్తున్నారు. ఒకవేళ సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకుంటే కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసే అవకాశముంది. అదే జరిగితే కమ్యూనిస్టులు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

బహుజన లెఫ్ట్​ఫ్రంట్​కూడా ఎన్నికల్లో పోటీకి దిగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్​పోటీ చేసి ప్రజల దృష్టిని ఆకర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడనున్న వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలన్నింటికీ పోలయ్యే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను తేల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్​ఎవరిపై ఎంత మేరకు పడుతుంది? దానిని ఎదుర్కోవడానికి ఉన్న అవకాశాలపై పార్టీలు స్టడీ చేస్తున్నాయి. 

బీఎస్పీ ఎఫెక్ట్ ఎంత? 

రాష్ట్రంలోని119 స్థానాల్లో పోటీ చేస్తామని బీఎస్పీ స్టేట్​ చీఫ్​ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ఐపీఎస్​అధికారిగా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల సెక్రటరీగా సుపరిచితుడైన ప్రవీణ్​కుమార్​ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అనేక నియోజకవర్గాలను కవర్​ చేస్తూ పాదయాత్ర చేశారు. సిర్పూర్​నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగుతున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధిస్తామని ప్రవీణ్​కుమార్​ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే విశారదన్​ మహరాజ్ ​నాయకత్వంలోని ధర్మసమాజ్​పార్టీ సైతం పోటీకి సిద్ధమవుతోంది. విశారదన్​ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి బడుగులకు అధికారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పార్టీ ప్రజలకు సుపరిచితమైనదే కావడంతో దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే దానిపైనా ఊహాగానాలు సాగుతున్నాయి.

వైఎస్సార్ టీపీ, జనసేన రంగంలోకి 

ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్​రాజశేఖర్​రెడ్డి బిడ్డ షర్మిల వైఎస్సార్​టీపీ పేరుతో పార్టీ పెట్టి దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్​ఉంది. షర్మిల కాంగ్రెస్​తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో చర్చలు జరిపినా చివరకు పొత్తు లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకొని అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన కూడా తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయనుంది. పవన్​కల్యాణ్​చరిష్మాతో ఆయా నియోజకవర్గాల్లో ఎంతమేరకు ఓట్లు పోలవుతాయనే దానిపైనా లెక్కలు వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్​తర్వాత కమ్మ కులం నేతలంతా ఏకమయ్యారు. వారంతా కాంగ్రెస్​వైపు చూస్తున్నట్టుగా చెప్తున్నా, తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ ప్రభావం ఎంతమేరకు ఉండొచ్చు అనే దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.