ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్​ ఇయ్యాల్నే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్​ ఇయ్యాల్నే
  • కౌంటింగ్​కు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ
  • ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ 

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం రానున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల భవితవ్యం తేలిపోనున్నది. ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను ప్రకటించనుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, 403 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్​లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, 117 సీట్లు ఉన్న పంజాబ్ లో ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మణిపూర్ లో బీజేపీ హవా కొనసాగుతుందని, ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్​ఫైట్ ఉంటుందంటూ తేల్చిచెప్పాయి. అయితే, ఈ అంచనాలు నిజమవుతాయా? లేక ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. గెలుపు మాత్రం తమదేనంటున్న ఇతర పార్టీల ధీమానే నిజమవుతుందా? అన్నది తేలిపోనుంది.  

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీదే గెలుపు.. పంజాబ్ ఆప్ దే.. ఉత్తరాఖండ్, గోవాలో పోటాపోటీ.. అంటూ ఎగ్జిట్ పోల్స్​లో వెల్లడైన అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయన్నది ఇయ్యాల్నే తేలిపోనుంది. ఎన్నికల సంఘం(ఈసీ) 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గురువారం కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను ప్రకటించనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో ఈసీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చినా.. గెలుపు తమదేనని ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు మాత్రం ధీమాగా ఉన్నాయి. 
కౌంటింగ్ కు 1200 సెంటర్లు 
ఐదు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య విడతల వారీగా పోలింగ్ పూర్తయింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఓట్లు లెక్కించేందుకు ఈసీ సుమారు 1200 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓట్ల కౌంటింగ్​కు 50 వేల మంది అధికారులను నియమించింది. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ అన్ని చోట్లా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను, తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. సిబ్బందికి మాస్కు లు, శానిటైజర్​లు, ఫేస్ షీల్డులు, గ్లౌజ్​లను అందుబాటులో ఉంచింది. కౌంటింగ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్త్​ ఏర్పాటు చేసింది. ఇక ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రాసెస్​ను పరిశీలించేందుకు 650 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది.   

ఇక్కడ వీళ్లే కీలకం.. 
నువ్వా? నేనా? అన్నట్లు పోటీ ఉన్న ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఇతర పార్టీలతో జట్టు కట్టే విషయంపై ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు షురూ చేసినయి. గోవాలో మళ్లీ హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలు ఉండటంతో ప్రధానంగా ఆప్, టీఎంసీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కీలకం కానున్నారు. ఉత్తరాఖండ్ లోనూ టైట్ పోటీ ఉండటంతో ఇండిపెండెంట్లు కింగ్ మేకర్ లుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మణిపూర్ లో ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోతే.. ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్, జేడీఎస్ వంటి పార్టీలు కీలకం కానున్నాయి. వీటిలో ఎన్ పీఎఫ్​తో బీజేపీ, ఆర్ఎస్ పీ, జేడీఎస్, లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి.