
ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా లోక్ సభ ఎన్నికల కోసం ఒకపక్క ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. మరోపక్క మీర్జాపూర్ జిల్లా చుట్టుపక్కల ఊళ్లలో ఆకుపచ్చ చీరలు కట్టుకున్న మహిళల గుంపు తిరుగుతోంది. వాళ్లేదో పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఊళ్లో ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే చాలూ.. డప్పులు వాయిస్తూ పండుగచేసే 'గ్రీన్ క్రూసేడర్' సభ్యులు వాళ్లంతా.
ఆడశిశువు హత్యల్ని అరికట్టే ఉద్దేశంతో కొందరు మహిళలు 'గ్రీన్ కూసేడర్స్' అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇరవై మంది సభ్యులున్న ఈ గ్రూప్ వారణాసి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ 'ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాదు' అనే సందేశాన్ని వినిపిస్తారు.
ఏం చేస్తారంటే
'పోషణ్ సే ప్రోత్సాహాన్ తక్' నినాదంతో గ్రీన్ కూసేడర్ల ఉద్యమం సాగుతోంది. ఊళ్లో ఆడపిల్ల పుట్టిందన్న సమాచారం అందితే చాలు.. కోలాహలంగా ఆ ఇంటికి వెళ్తారు. డోలక్, మంజీరలు వాయిస్తూ బకెట్లలో పండ్లను వెంట తీసుకెళ్తారు. బాలింతకు పండ్లు ఇచ్చి.. తీసుకోవాల్సిన పోషకాహారం గురించి చెప్తారు. ఆమె భర్త లేదంటే తండ్రితో మాట్లాడి కొన్ని జాగ్రత్తలు వివరిస్తారు. తర్వాత వీధుల్లోకి చేరి డప్పులు వాయిస్తూ 'సోహర్' పాట పాడుతారు.
రిజల్ట్ సంగతేంటి?
వారణాసికి యాభై కిలోమీటర్ల పరిధిలో కుషియారీ, జంగల్ మహల్, భవానీపూర్, రామపూర్ ఛత్తీస్, హినౌటా.. గ్రామాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఈ గ్రామాల్లో ఆడశిశు మరణాల కేసులు ఎక్కువగా నమోదు అయ్యేవి. దీంతో కుషియారీకి చెందిన పది మంది మహిళలు నాలుగేళ్ల క్రితం 'గ్రీన్ క్రూసేడర్లు' సంస్థను స్థాపించారు. సోషల్ యాక్టివిస్ట్ రవి మిశ్రా ఈ బృందానికి సలహాలు ఇస్తుంటాడు.
వాళ్ల కృషితో ఆడశిశుమరణాలు తగ్గడంతో పాటు గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను చుట్టుపక్కల ఊళ్లకు విస్తరించారు. ప్రస్తుతం ఈ గ్రూప్లో 200 మంది ఉన్నారు. గ్రీన్ క్రూసేడర్లలో అంతా గృహిణులే. ఇంటి పనుల్ని చక్కబెట్టుకున్నాక వాళ్లంతా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటారు. శిశు మరణాల్ని అడ్డుకోవడంతో పాటు బాలికా విద్య, మద్యపాన నిషేధం, కట్నం, జూదం లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆడా మగా నిష్పత్తి 906:1000గా ఉందని (పెరిగిందని) మున్నీ దేవి అనే కార్యకర్త చెబుతోంది. బెనారస్ హిందూ యూనివర్సిటీతో పాటు పలు యూనివర్సీటీల నుంచి స్టూడెంట్లు ఇచ్చే విరాళాలతో ఈ గ్రూప్ నడుస్తోంది. గ్రీన్ క్రూసేడర్ల కష్టాన్ని గుర్తించి ఒక్కోసారి ప్రజలే స్వచ్ఛందంగా బాలింతలకు పండ్లు సరఫరా చేస్తుంటారట.