
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా ఏడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్‌తో హౌస్ హీటెక్కింది. ఇంటి సభ్యుల మధ్య స్నేహాలు, బంధాలు ప్రమాదంలో పడ్డాయి. 44 వరోజు కంటెస్టెంట్ల మధ్య వార్ మరింత పెరిగింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. కెప్టెన్లు అయిన సుమన్ శెట్టి , గౌరవ్ తమకు నచ్చిన ఇంటి సభ్యులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. దీంతో సుమన్, ఇమ్మాన్యుయేల్ (ఇమ్ము)ను ఎంచుకోగా, గౌరవ్ ఆయేషాను ఎంపిక చేశాడు. ఆ తరువాత, వీరిద్దరికీ 'బెలూన్ టాస్క్' ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఇమ్ముకి ఐదు, ఆయేషాకి మూడు నామినేషన్ పవర్ స్లిప్‌లు దొరికాయి.
మాట తప్పిన కల్యాణ్..
తాను గెలుచుకున్న ఐదు టికెట్లలో ఒక టికెట్‌ను ఇమ్ము, తన స్నేహితుడైన కల్యాణ్ కు ఇచ్చాడు. అయితే, ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి కల్యాణ్ టికెట్ తీసుకున్నాడు. కానీ, తీరా నామినేట్ చేసే సమయంలో సంజనను నామినేట్ చేసి, ఇమ్మును ఆశ్చర్యానికి గురి చేశాడు. నువ్వు నాకు చెప్పిన పేరు ఒకటి, ఇప్పుడు చేసిందొకటి. ఇదేంటి తనూజను నామినేట్ చేస్తావని నమ్మి నీకు టికెట్ ఇచ్చాను. ఇలా మాట మారుస్తావని అసలు ఊహించలేదు అంటూ కల్యాణ్‌పై ఇమ్ము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బ్రేక్ అయిన ఫ్రెండ్‌షిప్?
బిగ్ బాస్ సీజన్ ప్రారంభం నుంచీ ఇమ్ము, కల్యాణ్‌లకు తనూజ బాగా దగ్గరగా ఉంది. ఈ ముగ్గురూ కలిసి ఉండేవారు. కానీ, ఇప్పుడు తనను నామినేట్ చేసేందుకు వారిద్దరూ పోటీ పడటం తనూజకు ఏ మాత్రం నచ్చలేదు. ఇది చాలా మోసం అంటూ దివ్యతో బాధను వ్యక్తం చేసింది. ఇమ్ము తన వద్ద ఉన్న ఐదు టికెట్లను ఒక్కటి కూడా ఉంచుకోకుండా ఇతరులకు ఇవ్వడం ద్వారా 'సేఫ్ గేమ్' ఆడాలని చూశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే ఇమ్ము ఒక టికెట్‌ను తనే ఉపయోగించి తనూజను నామినేట్ చేసి ఉంటే, అతనిపై కొంతవరకు పాజిటివ్ అభిప్రాయం ఉండేది. కానీ, కల్యాణ్‌తో ఈ ఆట ఆడించబోయి, తనే చెడ్డపేరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది.
ఇమ్ము-తనూజ మధ్య మాటల యుద్ధం
ఈ ఎపిసోడ్ లో తనూజ, ఇమ్ము మధ్య జరిగిన మాటల యుద్ధం మరింత వేడిని పెంచింది. 'నేను ఎవరినీ కేర్ చేయను' అంటూ తనూజ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీనికి అదే స్థాయిలో స్పందించిన ఇమ్ము.. ఇలాంటి వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేశాననే బాధ నాలో ఉంది అని అంటూ ఫైర్ అయ్యాడు. ఆటలో ఎవరు ఎవరి కోసం నిలబడరు అని తనూజ కౌంటర్ ఇవ్వగా.. ఇమ్ము చిన్నపిల్లోడిలా అప్పుడు నీ కోసం ఇది చేశాను.. అది చేశాను అంటూ పాత విషయాలు గుర్తుచేయడం హౌస్‌లో పెద్ద రణరంగాన్ని తలపించింది.
►ALSO READ | Thamma Review: ‘థామ’ రివ్యూ.. రొమాంటిక్ సాంగ్స్తో ఉర్రూతలూగించిన రష్మిక హారర్ మూవీ ఎలా ఉందంటే?
మొత్తంగా, 44వ రోజు ఎపిసోడ్ నామినేషన్ల కారణంగా స్నేహాలు, విశ్వాసాలు పక్కకు పోయి, వ్యక్తిగత వైరం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులలో రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజన, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి ఉన్నట్లు తెలుస్తోంది..