హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవలేదని ఎవరన్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వారి డిమాండ్లపై తాను చొరవ తీసుకోలేదా, ఎవరన్నారా మాట అని నిలదీశారాయన. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం వచ్చాక తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్మికులు 10 పనికి మాలిన డిమాండ్ల పెట్టారని, వాటిలో మొదటిదే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదని చెప్పారు. విలీనం అనేది సాధ్యమ్యేది కాదని అన్నారు. అర్థం లేకుండా పండుగ సమయంలో సమ్మెకు వెళ్లారని, ఏమైనా అంటే రెండు నెలల ముందే నోటీసు ఇచ్చామని అంటున్నారని, 20 నెల ముందిచ్చిన్నా ఏమైతదని ప్రశ్నించారు కేసీఆర్. నోటీసు ఇవ్వగానే సమస్యలు పరిష్కారమైతాయా అన్నారాయన. టైం పడుతుందని, అంతలోనే ఆగకుండా సమ్మెకు పోవడం సరికాదని చెప్పారు.
నేను చొరవ తీసుకోకుంటే కమిటీ ఎక్కడిది?
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై బాధ్యతతో ప్రభుత్వం చొరవ తీసుకుని, స్పందించిందని చెప్పారు సీఎం కేసీఆర్. నోటీసు ఇచ్చాక చర్చలకు పిలిపించింది వాస్తవం కాదా అని అడిగారు. ఆర్థిక శాఖ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ట్రాన్స్ పోర్ట్ సెక్రెటరీ కమిటీ ఏర్పాటు చేసింది తానేనని చెప్పారు. వాళ్లు ప్రభుత్వాన్ని రెప్రజెంట్ చేస్తారని, తాను చొరవ తీసుకోకుంటే ఆ కమిటీ ఎక్కడి నుంచి వచ్చేదని అన్నారు.

