బరువు తగ్గడానికి తొందరెందుకు?

బరువు తగ్గడానికి తొందరెందుకు?

హాలీవుడ్​ మోడల్​, నటి కిమ్​ కర్దాసియన్ ​మెట్​గాలా- 2022 లో వేసుకున్న గౌన్​ గురించి బోలెడన్ని చర్చలు నడుస్తున్నాయి. అందుకు కారణాలు రెండు. అవేంటంటే.. ఆ డ్రెస్​ని​ 1962లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ పుట్టినరోజుకి హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ప్రత్యేకంగా డిజైన్‌‌ చేయించుకోవడం ఒక కారణమైతే. ఆ డ్రెస్​ని వేలంలో4.8 మిలియన్ల డాలర్లకి కొనుకున్న కిమ్​.. దాన్ని వేసుకునేందుకు 3 వారాల్లోనే 7. 25  కేజీలు తగ్గడం మరొక కారణం. ఇవే కాకుండా బరువు తగ్గేందుకు ఆమె ఫాలో అయిన షుగర్​ , కార్బ్ ఫ్రీ డైట్​తో పాటు వెయిస్ట్​ ట్రైనర్​ గురించి  సోషల్ మీడియాలో పోస్ట్​ చేసింది కిమ్. దాంతో ఫిట్​నెస్ ​ కోసం సెలబ్రిటీలు చేసే  డైట్​లు మరోసారి హాట్​ టాపిక్​ అయ్యాయి. 

ఫిట్​నెస్​ మంత్రా అంటూ సెలబ్రిటీలు పోస్ట్​ చేసే డైట్​, వర్కవుట్​, స్లిమ్మింగ్​ స్ట్రాటజీలు​​ చాలామందిని అట్రాక్ట్​ చేస్తుంటాయి. తమ ఫేవరెట్​ సెలబ్రిటీల్లా పర్ఫెక్ట్​ బాడీ షేప్​ కోసం వెనకా ముందు ఆలోచించకుండా వాటిని ఫాలో అవుతుంటారు కొందరు. కానీ, వాళ్లు చేసే అన్ని డైట్​లు​, వర్కవుట్​లు అందరికీ సరిపడవు. ఒక్కొక్కరి శరీరం తీరు ఒక్కోలా ఉంటుంది. అదే విషయంపై కిమ్​ని ఎగ్జాంపుల్​గా చూపిస్తూ అవేర్​నెస్​ కల్పిస్తున్నారు ఫిట్​నెస్​ ఎక్స్​పర్ట్స్, డాక్టర్స్. ముఖ్యంగా కిమ్​ బరువు తగ్గడానికి సజెస్ట్​ చేసిన వెయిస్ట్​ ట్రైనర్స్​ గురించి మాట్లాడుతున్నారు. ‘అవి అంత డేంజరా?’  అని అడిగితే.. డేంజరే అంటున్నారు డాక్టర్ నవోదయ. 

వెయిస్ట్​ ట్రైనర్స్ అంటే...

వెయిస్ట్​ ట్రైనర్స్​ అంటే నడుం చుట్టూ బెల్ట్​లా బిగించి ఉండే  బెల్ట్స్​. వీటినే కోర్సెట్​ స్టయిల్ బెల్ట్స్ అని కూడా అంటారు. ఇవి నడుము దగ్గరి భాగాన్ని నొక్కి పెడతాయి. కొవ్వు పదార్థాల్ని కరిగిస్తాయి. కానీ, ఏ మెకానిజంలో కొవ్వును కరిగిస్తాయన్నది ఎవరికీ తెలియదు. డాక్టర్​గా చెప్పాలంటే ఇలాంటి వాటిని వాడకూడదు. కానీ, తేలిగ్గా బరువు తగ్గొచ్చని, అందంగా కనపడొచ్చని  ఇతర దేశాల్లో ​ చాలామంది ఈ బెల్ట్​లు వేసుకుంటున్నారు. ఆ ట్రెండ్​ ఇప్పుడు మన దగ్గరా మొదలైంది. కానీ, వీటివల్ల  మెడికల్​ కాంప్లికేషన్స్​ చాలా వస్తాయి. పక్కటెముకల్లో పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఈ బెల్ట్​ పెట్టుకుంటే పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి చెమట ఎక్కువ పట్టి, శరీరంలో నీరు తగ్గిపోతుంది. 

ఆక్సిజన్​ అందదు

వెయిస్ట్ ట్రైనర్స్ బెల్ట్స్​​ని మందమైన ఫ్యాబ్రిక్స్, గట్టి మెటల్​ని పోలి ఉండే మెటీరియల్​తో తయారుచేస్తారు. ఇవి పెట్టుకుంటే మొదట చర్మాన్ని, ఆ తర్వాత టిష్యూల్ని, కండరాల్ని... దాటుకుని వెళ్లి కొవ్వు పదార్థాల్ని కరిగిస్తాయి. అంటే కొవ్వు చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాల మీద ఒత్తిడి పెడతాయి. జీర్ణ వ్యవస్థలోని భాగాల మీద కూడా ప్రభావం చూపుతాయి. అన్నవాహిక, పొట్ట, పేగులు ఇలా  ఒకటేంటి అన్నింటినీ ఇబ్బంది పెడతాయి. వీటిని పెట్టుకోవడం వల్ల కణజాలాలు, కండరాలకి ఆక్సిజన్​ అందదు. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అన్నింటికీ మించి ఇవి కలిగించే ఒత్తిడి వల్ల కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి వెళ్లి.. గుండెలో మంట వస్తుంది. 

ఈ తిప్పలు తప్పవు

ఈ ట్రైనర్స్​ను​​ వేసుకున్నప్పుడు పొత్తి కడుపుపై పడే ఒత్తిడి.. లివర్​, కిడ్నీ లాంటి భాగాలపైన  ప్రెజర్​ పెంచుతుంది. ఎక్కువ రోజులు ఇలానే జరిగితే ఆ భాగాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఎక్కువ. కండరాలు బలహీనమవుతాయి. వికారం, మూర్ఛ లాంటి వాటికి కూడా కారణం అవుతాయి ఈ బెల్ట్స్. వాటివల్ల కొన్ని సందర్భాల్లో గాయాలు అవుతాయి. ఈ బెల్ట్స్​ని రెగ్యులర్​గా వాడితే బాడీకి సరైన ఎక్సర్​సైజ్​ అందక శరీరంలో లోతుగా ఉండే కోర్​ కండరాలు దెబ్బతింటాయి. అలాగే శరీరాన్ని కదిలించకపోవడం వల్ల కోలన్​, బ్లాడర్​, బ్రెస్ట్, ఎండో మెట్రియమ్​, కిడ్నీ, లంగ్​, పొట్ట క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని స్టడీలు చెప్తున్నాయి. కార్డియోవాస్క్యులర్​ జబ్బులకి కారణం కూడా ఎక్సర్​సైజ్​ చేయకపోవడమే. అలాగే టైప్​​– 2 డయాబెటిస్, మెటబాలిక్​ సిండ్రోమ్, హై బీపీ​, కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్ లాంటి సమస్యలొస్తాయి.  అలాగే ఆమె ఫాలో అయిన షుగర్​ ఫ్రీ, కార్బ్​ ఫ్రీ  డైట్​ వల్ల కూడా తిప్పలు తప్పవు.

బాడీని బట్టి డైట్​ 

వెయిట్​ లాస్​ ఎప్పుడు నిదానంగా ఉండాలి.ఉన్నట్టుండి సడెన్​గా తగ్గారంటే... శరీరానికి అందాల్సిన కేలరీలు, ఫ్యాట్స్​ అన్నింటినీ ఆపేసినట్టు అర్థం. విటమిన్,  మినరల్స్​ డెఫిషియన్సీ వస్తుంది. అలాగే శరీరాన్ని ఎనర్జిటిక్​గా ఉంచేది గ్లూకోజ్ కార్బో హైడ్రేట్స్​ నుంచే వస్తుంది. అలాంటి వాటిని పూర్తిగా మానేయడం వల్ల మొదటిగా ఎఫెక్ట్​ అయ్యేది బ్రెయిన్​. దానివల్ల మతిమరుపు వస్తుంది. మూడ్​ స్వింగ్స్​ ఎక్కువ అవుతాయి. మొత్తం మెటబాలిజం దెబ్బతింటుంది. రక్తంలోని గ్లూకోజ్​ లెవల్స్​లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. మరెన్నో న్యూరోలాజికల్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. కార్బ్స్​​ అందకపోవడం వల్ల బాడీ ఫ్యాటీ యాసిడ్స్​తోనే  నడుస్తుంది. దీనివల్ల కీటోన్స్​ నోటి ద్వారా ఎసిటోన్​ రూపంలో రిలీజ్​ అవుతాయి. దీనివల్ల నోరు దుర్వాసన వస్తుంది. కార్బ్స్​​ సరిపడా శరీరానికి అందకపోతే కాలేయం పాడవుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే శరీరానికి కొద్ది మొత్తంలో అయినా కార్బోహైడ్రేట్స్​ అందించాలి. షుగర్​ ఫ్రీ డైట్​ వల్ల కూడా ఈ సమస్యలన్నీ వస్తాయి. అందువల్ల ఫలానా సెలబ్రిటీలు చెప్పారు కదా! అని ఏ డైట్​ పడితే ఆ డైట్​ ఫాలో అవ్వకూడదు. బరువు తగ్గాలను కుంటే హెల్దీగా తగ్గాలి. డాక్టర్​ సలహా మేరకే  బాడీని బట్టి డైట్​ ఫాలో అవ్వాలి.

హెల్దీగా బరువు తగ్గొచ్చిలా..

బరువు తగ్గాలనుకున్నప్పుడు మొదట లైఫ్​ స్టయిల్​పై ఫోకస్​ పెట్టాలి.  అలా చేసినా ఫలితం లేకపోతే డాక్టర్​ సలహా ప్రకారం మెడిసిన్స్​ , ఆ తర్వాత సర్జరీ ఉన్నాయి. కానీ,  వెయిస్ట్​ ట్రైనర్స్​ బెల్ట్స్​ ప్రస్తావన ఎక్కడా లేదు. ఇది ఏ విధంగా బరువు తగ్గిస్తుందన్న దానిపై ఆధారాలు  లేవు. పైగా ఇవి కాలేయం, కిడ్నీలని ఎఫెక్ట్​ చేస్తాయని చాలా రీసెర్చ్​లు  తేల్చాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు... హెల్దీగా తగ్గే ప్రయత్నం చేయాలి. అలాగే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్ని డైట్​లు అందరికీ సెట్​ కావు. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే ఫుడ్​ తినాలి. యోగా, ఎక్సర్​సైజ్​తో పాటు కనీసం వారానికి 150  నిమిషాలు నడవాలి. చిప్స్‌‌, శ్నాక్స్‌‌, బిస్కెట్స్‌‌ లాంటి చిరుతిండ్లకి దూరంగా ఉండాలి. నీటి శాతం ఎక్కువ ఉండే పండ్లు, కూరగాయలు తింటే కడుపు నిండినట్లు ఉంటుంది. ఫ్యాట్​ తక్కువగా ఉండే చికెన్, చేపలు తినడం మేలు. అది కూడా పరిమితంగా మాత్రమే. అలాగే డాక్టర్​ని కలిసి బాడీకి సూట్​ అయ్యే డైట్​ ఫాలో అవ్వాలి.