సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన అభివృద్ది.. మునుగోడులో ఎందుకు చేయలే?

సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన అభివృద్ది.. మునుగోడులో ఎందుకు చేయలే?

చండూరు, వెలుగు: సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి.. మునుగోడులో ఎందుకు చేయలేదని సీఎం కేసీఆర్​ను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్​ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రశ్నించారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పిన కేసీఆర్, మునుగోడు నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. బుధవారం నల్గొండ జిల్లా చండూరులో పద్మశాలీలు ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీలో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో మునుగోడు ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే.. నియోజకవర్గ అభివృద్ధి చేయలేకపోయానని.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశానన్న బాధతోనే పదవికి రాజీనామా చేశానని అన్నారు. 

దేశ వ్యాప్తంగా మునుగోడుపై చర్చ

దేశవ్యాప్తంగా మునుగోడుపై చర్చ జరుగుతోందని రాజగోపాల్ అన్నారు. ‘‘నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. కానీ ఏం చేయలేకపోయా. అప్పులు తెచ్చి ఎంతో మందికి సాయం చేస్తున్నా. ఎన్ని నిందలు వేసినా భరించా. నేను అమ్ముడుపోయిన అని ప్రచారం చేస్తున్నరు. 12మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడే.. నేను వెళ్లి ఉంటే మంత్రి అయ్యేవాడిని. నన్ను కొనే శక్తి ఇంకా పుట్టలేదు” అని రాజగోపాల్​ రెడ్డి అన్నారు.  2014 కు ముందు కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత? ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. తాను ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తున్నా అన్నారు.  రాష్ట్ర ప్రజల కష్టాలు చూసి బాధపడిన కొండా లక్ష్మణ్ బాపూజీ 1969లో మంత్రిగా ఉండి, సీఎం బ్రహ్మానంద రెడ్డిని ఎదిరించి తన పదవికి రిజైన్ చేశారని బీజేపీ లీడర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ ప్రజల బాగుకోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 800 మంది కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.