మోడీ కేబినెట్​లో ఎందుకీ మార్పులు?

మోడీ కేబినెట్​లో ఎందుకీ మార్పులు?

కరోనా సెకండ్​ వేవ్​ దేశాన్ని దారుణంగా దెబ్బతీసింది. కరోనా సెకండ్​ వేవ్​కు ఇండియా సరిగ్గా సిద్ధం కాలేదు. తమ పనిని సక్రమంగా నిర్వర్తించడంలో హెల్త్​ మినిస్ట్రీ, ఇతర కేంద్ర మంత్రులు ఫెయిల్​ అయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎకానమీ కూడా అనుకున్న స్థాయిలో వృద్ధి సాధించడం లేదు. కరోనా సెకండ్​ వేవ్​, థర్డ్​ వేవ్​ను కంట్రోల్​ చేసినంత మాత్రాన సరిపోదనే విషయాన్ని నరేంద్రమోడీ గమనించారు. తన ప్రభుత్వం మరింత సమర్థవంతంగా మారాలనే విషయం మోడీకి తెలుసు. అందుకోసమే ఆయన కేబినెట్​ విస్తరణ కోసం దాదాపు నెల రోజుల పాటు కసరత్తు చేసి సమర్థవంతంగా పనిచేయని మంత్రులను తప్పించారు. కానీ, 1952 నుంచి దేశంలో 36 మంది కొత్త మంత్రులు, ఏడుగురికి ప్రమోషన్లు, 12 మంది మంత్రులను తప్పించడం ఇంతకుముందెన్నడు జరగలేదు. 

ఒకప్పటి బ్రిటిష్​ ప్రధానమంత్రి విలియమ్​ గ్లాడ్​స్టోన్​ వందేండ్ల క్రితం ‘‘ఒక మంచి ప్రధాని కచ్చితంగా తెగనరికే వ్యక్తిగా కూడా ఉండాలి’’ అంటూ చెప్పిన మాట ఎంతో ఫేమస్​ అయ్యింది. ఒక మంచి ప్రధాని ఫెయిల్​ అయిన మంత్రులను తొలగించాలని, సక్సెస్​ అయిన వారికి రివార్డ్​ ఇవ్వాలనేది గ్లాడ్​స్టోన్​ ఉద్దేశం. తన మంత్రులను, పార్లమెంటును తాను తదుపరి ఏం చేస్తాననే దానిపై మంచి ప్రధాని ఎప్పుడూ ఆలోచించేలా చేయాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పుడూ అలర్ట్​గా, జాగ్రత్తగా ఉంటుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 నుంచి 2021 వరకూ మంత్రులను పక్కన పెట్టేందుకు  తటపటాయించే వారు. అత్యంత సమర్థవంతమైన ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నంత వరకు మంత్రులు పట్టింపు లేదని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆయన ఆలోచనా విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

కేంద్ర కేబినెట్​లో ప్రధాన మార్పులివే..
1. కొందరు మంత్రులను తప్పించడం
హెల్త్​ కేర్, మెడిసిన్​ ఉత్పత్తిలో సమస్యలకు ప్రధాన కారణం హెల్త్​ మినిస్టర్​ హర్షవర్థన్, కెమికల్స్​ మినిస్టర్​సదానందగౌడ. తప్పించిన వారిలో ఫెయిల్​ అయినట్టు స్పష్టంగా కనిపిస్తున్న మంత్రులు వీరే. సామర్థ్యం మేరకు పనిచేయని మరికొందరు మంత్రులు కూడా ఉన్నారు. ప్రకాశ్​ జవదేకర్, రవిశంకర్​ ప్రసాద్ ను మోడీ పక్కనపెట్టారు. వీరిద్దరిని అనూహ్యంగా తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వీరిద్దరి పనితీరుతో ప్రధాని సంతృప్తిగా లేరనే విషయం దీనితో వెల్లడైంది.
2. పాపులర్​ లీడర్లకు ప్రాధాన్యత
ఇప్పటి వరకూ ప్రధాని మోడీ స్ట్రాంగ్, పాపులర్​ పొలిటీషియన్లకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ, ఇటీవలి పరిణామాలు ప్రభుత్వంలో స్ట్రాంగ్​ పొలిటీషియన్లు కచ్చితంగా ఉండాలనే వాదనతో ఆయన కన్విన్స్​ అయ్యేలా చేశాయి. అందువల్లే మోడీ.. అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్​రాణె, జ్యోతిరాధిత్య సింథియాతో పాటు మరికొందరినీ కేబినెట్​లోకి తీసుకున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. రాజీవ్​గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్నప్పుడు వారి కేబినెట్లలో 15 మంది మాజీ ముఖ్యమంత్రులకు చాన్స్​ ఉండేది.
3. బెంగాల్​ ఇంపార్టెన్స్
బెంగాల్​ విషయానికి వస్తే అక్కడి మతువా, రాజ్​బోన్షి కులాలకు చెందిన వారు గతంలో ఎన్నడూ ఢిల్లీలో మంత్రులుగా లేరు. తొలిసారిగా ఈ సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రులయ్యారు. ఇది మమతా బెనర్జీకి గట్టి సవాలే.
4. సత్తా కలిగిన రిటైర్డ్​ అధికారులు
నరేంద్రమోడీ రిటైర్డ్​ అధికారులకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనే ఇచ్చారు. ఉదాహరణకు ఫారిన్​ మినిస్టర్​ జైశంకర్​ ఆఫీసర్​ నుంచి మినిస్టర్​గా మారి సక్సెస్​ అయ్యారు. ఈ పాలసీ కారణంగా ఎక్కువ లాభం పొందింది మాత్రం కొత్త ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈయన మాజీ ఐఏఎస్​ అధికారి. హర్దిప్​ పురి, ఆర్​కే సింగ్​ లాంటి మాజీ అధికారులకు ప్రమోషన్లు దక్కాయి. ఇప్పటి వరకైతే, ఈ అధికారులు గొప్పగా పని చేస్తారని చాలా అంచనాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాల్లో కూడా చాలా మంది రిటైర్డ్​ అధికారులు ఉన్నారు. వారందరివీ పెద్ద ఫెయిల్యూర్​ స్టోరీలే. ఇప్పుడు పదవి దక్కించుకున్న రిటైర్డ్​ ఆఫీసర్లు ఏం సాధిస్తారనేది కాలమే చెప్పాలి.
5. మహిళలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, దళితులకు ప్రాధాన్యత ఇవ్వడానికి కచ్చితమైన ప్రయత్నం జరిగింది. బీజేపీ బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుందనే సందేశాన్ని ఇచ్చింది.
6. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈశాన్య ప్రాంతానికి చెందిన కిరణ్​ రిజుజును శక్తివంతుడైన న్యాయ శాఖ మంత్రిగా చేశారు.
7. 2019 లోక్​సభ ఎన్నికల తర్వాత మోడీ మిత్రపక్షాలను, చిన్న పార్టీలను పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు మోడీ ఈ పాలసీని కూడా మార్చుకున్నారు. వారికి కూడా ప్రభుత్వంలో చోటు కల్పించారు. ఇది చాలా మంచి అడుగు. 

కొత్త మంత్రుల సత్తా ఎంత?
కేబినెట్​ విస్తరణపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. హర్షవర్ధన్, జవ్‌‌దేకర్, రవిశంకర్ ప్రసాద్, సదానందగౌడలను ఏడేండ్ల క్రితం మోడీ మంత్రులను చేసినప్పుడు, ఆయనకు వారు దశాబ్దాలుగా తెలుసు. అయినా, ఈరోజు మోడీ వారిని పక్కనపెట్టారు. రిటైర్డ్ ఆఫీసర్లు మాత్రం ఇప్పుడు మంత్రులుగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్త మంత్రులు ఎలా మారతారనేది మనం వేచి చూడాలి. 

ప్రతిపక్షాలను ఆశ్చర్యపరిచారు
నోట్లరద్దు, జీఎస్టీ అమలు, లాక్​డౌన్​ వంటి పెద్ద పాలసీలకు సంబంధించిన సడెన్​ అనౌన్స్​మెంట్ల గురించి మరిచిపోవాలి. మినిస్టర్లతో సంప్రదింపులు జరపాలి. భారీ మార్పులు చేసి ప్రతిపక్షాలను మోడీ ఆశ్చర్యపరిచారు. మంచి విషయం ఏమిటంటే, దిద్దుబాటు అవసరమనే విషయాన్ని మోడీ వేగంగా గమనించడం. ఈ భారీ కేబినెట్​ విస్తరణ ద్వారా మోడీ కొత్తగా ప్రయత్నించడానికి అవకాశం ఇస్తుంది. కేబినెట్​ విస్తరణ మార్పులు తెచ్చిందా? లేక మార్పులేవీ రాలేదా? అనేది వచ్చే ఆరు నెలల్లో తెలియనుంది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్