అగస్ట్ 22న మద్రాస్ డే ఎందుకు జరుపుకుంటారు..?

 అగస్ట్ 22న మద్రాస్ డే ఎందుకు జరుపుకుంటారు..?

చెన్నై నగరం.. ఎన్నో ప్రత్యేకతల నిలయం. ఐఐటీ, హెల్త్ కేర్, చలనచిత్రం సహా ఎన్నో రంగాల్లో పురోగతి సాధించిన నగరం. ఎంతోమంది కలల సాకారానికి సాక్ష్యంగా నిలుస్తోన్న పట్టణం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న చైన్నై తన 383వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1639 అగస్ట్ 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు ఇవ్వాలని బ్రిటీషర్లు కోరగా..దానికి అప్పటి విజయనగర రాజు అంగీకరించి భూమిని ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదే ఈ ప్రాంతంలో సెయింట్ జార్జి కోటను నిర్మించారు.

అప్పటి నుంచి బ్రిటీషర్లు ఇక్కడి నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలు కొనసాగించారు. ముందుగా మచిలీపణాన్ని ఎంచుకున్న బ్రిటీషర్లు..తుఫాను ధాటికి వారి వ్యాపార కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అవడంతో అనువైన ప్రాంతం కోసం అన్వేషించారు. చివరకు కోరమాండల్ తీరంలోని మద్రాస్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని కార్యకలాపాలు సాగించారు. 

చెన్నై సాంస్కృతికంగా గొప్పది. ప్రముఖ కవి తిరువల్లువర్.. నగరం పొరుగున ఉన్న మైలాపూర్‌లో నివసించినట్లు సమాచారం. ఈ ప్రాంతాన్ని శక్తివంతమైన పాండ్యులు, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు పాలించారు. పల్లవులు మహాబలిపురంలోని ప్రసిద్ధ రథాలను నిర్మించారు

గత మూడున్న శతాబ్దాలుగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. 1996లో మద్రాస్ ను చెన్నైగా మార్చారు. 2004 నుంచి మద్రాస్ డై ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముత్తయ్య, శశినాయర్, విన్సెంట్ డిసౌజా ఆలోచనల నుంచి ఈ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి నగర చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 2004లో ఐదు కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 2007 నాటికి 60కి చేరుకున్నాయి. ఇప్పుడు వారం రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తోన్నారు.