మూడు రోజుల వానకే ఢిల్లీ మునిగింది.. కారణమేంటంటే..

మూడు రోజుల వానకే ఢిల్లీ మునిగింది.. కారణమేంటంటే..

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల తర్వాతో ఢిల్లీ వణుకుతోంది. యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీకి తీవ్ర వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదకర మార్కును అధిగమించి ప్రవహిస్తోన్న యమునా నీటి మట్టంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ నీటి మట్టం 208.48 మీటర్లుగా ఉంది. ఇది గతంలో 1978లో సెట్ చేసిన 207.49 మీటర్ల గరిష్ట స్థాయిని అధిగమించింది.

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు , అలాగే హర్యానాలోని హత్నీ కుండ్ బ్యారేజీ నుండి నీటిని విడుదల చేయడం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో వరదలు కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే ఢిల్లీ ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఇతర అంశాలు కూడా కారణమై ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "హత్నికుండ్ బ్యారేజీ నుంచి విడుదల చేసిన తర్వాత ఆ నీరు గత సంవత్సరాలతో పోలిస్తే ఢిల్లీకి చేరుకోవడానికి తక్కువ సమయం పట్టినట్టు తాము గమనించామని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి)  తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు కూడా అని వెల్లడించారు. నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేది.. ఇప్పుడు ఈ ఆక్రమణల కారణంగా తక్కువ స్థలం అయిందని చెప్పారు.

దేశ రాజధానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని యమునానగర్ వద్ద ఉన్న బ్యారేజీ నుంచి నీరు ఢిల్లీకి చేరుకోవడానికి రెండు మూడు రోజులు పడుతుంది...కానీ తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షాపాతం, స్థలం లేకపోవడం వల్ల ఈ సారి తీవ్ర స్థాయిలో వరదలు వస్తున్నాయని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH)లోని నేచురల్ హెరిటేజ్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మను భట్నాగర్ తెలిపారు.

సాధారణంగా ఈ స్థాయిలో వరదలు రావాలంటే కనీసం వారం రోజుల పాటు వర్షాలు పడాలి. కానీ...ఇక్కడ మూడు రోజుల్లోనే అధిక వర్షపాతం నమోదవడం వల్ల వరదలకు సిద్ధమయ్యే లోపే ఢిల్లీని చుట్టుముట్టేశాయి. నదీ తీర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురి కావడమూ అతి పెద్ద సమస్యగా గోచరిస్తోంది. వరదల ధాటికి ఇప్పటికే 20కి పైగా వంతెనలు కొట్టుకుపోయాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తుండగా.. అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం సాయం కూడా కోరారు.