సిద్ధరామయ్య ఒక సమస్యగా మారతారా లేక ఒక ఆస్తిగా మారతారా?

సిద్ధరామయ్య ఒక సమస్యగా మారతారా లేక ఒక ఆస్తిగా మారతారా?

కర్నాటక మాజీ  ముఖ్యమంత్రి  సిద్ధరామయ్యది ఒక విశేషమైన రాజకీయ ప్రస్థానం. ఆయన మొట్టమొదట 1983లో శాసనసభ్యుడిగా, 1985లో  మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1997లో  ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. అప్పటి నుంచి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గానో,  ఉప  ముఖ్యమంత్రిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో సేవలు అందిస్తూనే వచ్చారు.

రామకృష్ణ హెగ్డే  మంత్రివర్గంలో  మంత్రిగా  బాధ్యతలు చేపట్టినప్పుడు సిద్ధరామయ్య జనతా పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత  ఆయన హెచ్.డి. దేవెగౌడతో చేతులు కలిపారు.   సిద్ధరామయ్య  రాజకీయ ఎదుగుదల నిరాటంకంగా కొనసాగింది. అయితే 2005లో  సిద్ధరామయ్య  దేవెగౌడతో  విభేదించి బయటకు వచ్చారు.

కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2006లో  సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో  చేరారు. అనంతరం ఆయన ఒక రాజకీయ వంశపారంపర్య  వారసత్వాన్ని కూడా నిర్మించుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా  చేయాల్సి రావడం పట్ల సిద్ధరామయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారన్న విషయంలో ఎటువంటి  సందేహం లేదు.  అంతేకాకుండా పాలన తీరు సరిగా లేకపోవడం వల్ల నాయకత్వ మార్పు అవసరమని ఆయన సొంత పార్టీ సభ్యులే  బహిరంగంగా వాదించడం కనిపించింది.  అందువల్ల  సిద్ధరామయ్య తన పదవిని  వీడుతున్నప్పుడు  ఆయన చుట్టూ  ఒక  గొప్ప  వైభవం లేదా  కీర్తిప్రతిష్టల కోటరీ ఏదీ కనిపించలేదు.

2023 ఎన్నికల తర్వాత  సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య అధికారాన్ని పంచుకునే ఒప్పందం గురించి విస్తృతమైన ఊహాగానాలు చెలరేగాయి.  అధికారికంగా  ఖండించినప్పటికీ చాలామంది అలాంటి ఏర్పాటు ఉందని నమ్మారు.  శివకుమార్  కూడా ముఖ్యమంత్రిగా తన వంతు కోసం పట్టుబట్టారు.  కాంగ్రెస్  హైకమాండ్,  గాంధీ కుటుంబం సిద్ధరామయ్యను తొలగించడానికి సుముఖంగా లేవని సమాచారం. సిద్ధరామయ్యే ఎక్కువ అనుభవజ్ఞుడైన పరిపాలకుడని వారు భావించినట్లు కనిపించింది. 

అయితే  ముఖ్యమంత్రి పదవి అధిష్టించనున్న శివకుమార్  ఎలా  పరిపాలిస్తారనే దానిపై  ఆందోళనలు కూడా పార్టీ వర్గాల్లో ఉన్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత కర్నాటకలో కాంగ్రెస్  ప్రభుత్వం ఊహించిన దానికంటే  మెరుగైన పనితీరు కనబరచడం, కాంగ్రెస్ నాయకత్వం రాజకీయంగా  బలంగా కనిపించడంతో  శివకుమార్  తాత్కాలికంగా తన డిమాండ్లను తగ్గించుకున్నారు. కానీ  ఆ  తర్వాత, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఎన్నికలలో  ఎదురుదెబ్బలతో  ప్రతిపక్ష కూటమి బలహీనపడింది.

వి. డి. సతీశన్  బహిరంగంగా   కేరళలో  నాయకత్వం  కావాలని  డిమాండ్ చేయడంతో  కీలక మలుపు వచ్చిందని  సమాచారం. సుదీర్ఘ  అంతర్గత  పోరాటం తర్వాత కాంగ్రెస్  హైకమాండ్ రాజీ పడిందని తెలిసింది. దీంతో   మరోసారి ముఖ్య మంత్రి  పదవి కోసం శివకుమార్  బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసింది.  సతీశన్ కంటే శివకుమార్ చాలా శక్తిమంతమైన రాజకీయవేత్తగా పరిగణిస్తారు. 

తిరుగుబాటు జరిగే అవకాశం ఎదురవడంతో  కాంగ్రెస్  నాయకత్వం చివరికి అత్యంత సురక్షితమైన మార్గమని  భావించిన దానిని ఎంచుకుంది.  సిద్ధరామయ్య  పదవి నుంచి తప్పుకోగా శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఒకవేళ కాంగ్రెస్  హైకమాండ్  కేరళ పరిస్థితిని ముందే దృఢంగా చక్కదిద్దినట్లయితే డీకే శివకుమార్ బహుశా అంత దూకుడుగా వ్యవహరించేవారు కాదేమో! చివరికి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది.

సిద్ధరామయ్య ఒక సమస్యగా మారతారా లేక ఒక ఆస్తిగా మారతారా?

సిద్ధరామయ్య  వెనుకబడిన తరగతులకు చెందినవారని,  తనకు గణనీయమైన మద్దతు ఉందని చెప్పుకుంటున్నారన్నది  నిజమే.  అయితే, కాంగ్రెస్  లేదా భారతీయ జనతా పార్టీ వంటి పార్టీలలో ఒక నాయకుడు అధికారంలో  లేకపోయిన తర్వాత  క్రమంగా వారి రాజకీయ ప్రభావం తరచుగా తగ్గుతుంది.  సిద్ధరామయ్యకు  పూర్తి ఆత్మవిశ్వాసం ఉండి ఉంటే  ఆయన  ఒక  ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి ఉండేవారు.  ఒక జాతీయ పార్టీ గొడుగు కింద సుదీర్ఘ  రాజకీయ  మనుగడ  సాగించడం అత్యంత కష్టమని ఆయనకు తెలుసు.

డీకే శివకుమార్​కు  చెందిన శక్తిమంతమైన  వొక్కలిగ సమాజం,  లింగాయత్ సమాజం కలిసి కర్నాటక రాజకీయాలలో అపారమైన  ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.  ఈ రెండు  సమూహాలు అనేక నియోజకవర్గాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలో అవి సిద్ధరామయ్య పదవిలో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తాయి. కాంగ్రెస్  హైకమాండ్  సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటుతోపాటు  జాతీయ  రాజకీయాల్లో  పెద్ద పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం.  అయితే  కర్నాటక నుంచి తనను తొలగించడానికే  ఇదొక కుట్ర అని,  తాను ఢిల్లీ వెళ్ళాక తన ప్రాసంగికతకు తావులేదని గ్రహించిన సిద్ధరామయ్య ఆ ఆఫర్‌ను  తెలివిగా తిరస్కరించారు. 

రాజకీయ పరీక్ష 
చాలామంది భారతీయ రాజకీయ నాయకులు గొప్ప పదవులు చేపట్టి, చివరికి రాజకీయ పతనంతో తమ రాజకీయ జీవితాన్ని ముగించారు. రాజీవ్ గాంధీ,  పీవీ  నరసింహారావు ఇద్దరూ సమర్థవంతమైన ప్రధానమంత్రులే, అయినప్పటికీ ఇద్దరూ చివరికి అధికారాన్ని కోల్పోయి ఆ తర్వాత  రాజకీయంగా  ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు  సిద్ధరామయ్య రాజకీయంగా  ఎలా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తారో చూడాలి.

ఆయన ముందు డీకే శివకుమార్ రూపంలో బలమైన, చాకచక్యమైన ప్రత్యర్థి నిలబడి ఉన్నారు.  సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు  ఆయనను  అనుసరించారు. రాజీనామా చేసే సమయంలో 110 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.  అయితే, అందరు  మనుషులలాగే  రాజకీయ నాయకులు  కూడా మండుతున్న  ఓడ నుంచి పారిపోతారు లేదా  మరో  శిబిరంలోకి  దూకుతారు.

బీజేపీ  కూడా అవిశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల బెడద నుంచి  విముక్తి పొందలేదు.  బీజేపీ  మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్,  వసుంధర రాజే సంవత్సరాలపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లను పాలించారు.  అయినప్పటికీ వారిని తొలగించినప్పుడు, తిరుగుబాటు  గుసగుసలు  కూడా  వినిపించలేదు.  కొన్నిసార్లు కఠినమైన నిజాన్ని సున్నితంగా తెలియజేయాల్సి ఉంటుంది. సిద్ధరామయ్య ఇప్పుడు తన రాజకీయ జీవితంలో అతిపెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు.  

ఆయనకు మద్దతుగా  ఉన్న 110 మంది  ఎమ్మెల్యేలలో  ఇప్పటికే  ఎంతమంది ఆయనను విడిచిపెట్టారో  తెలియాలి.  చాలామంది  ఎమ్మెల్యేలు  ఇప్పటికే  శిబిరాలు మారి ఉండవచ్చు. రాజకీయం ఒక టఫ్​ బిజినెస్​.  శాశ్వత  మిత్రులు లేదా శత్రువులు ఉండరు, నిరంతర విధేయతలు ఉండవు.

భవిష్యత్తుకే ప్రాధాన్యత
సిద్ధరామయ్య  రాజీనామా సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను. అంతేకానీ రాజకీయాలకు రాజీనామా చేయలేదు’ అన్నారు. పదవిలో లేకపోవడంతో  ఢిల్లీలో ఆయన  క్రమంగా తన రాజకీయ  ప్రాధాన్యతను కోల్పోవచ్చు. కానీ,  సిద్ధరామయ్య బెంగళూరు రాజకీయాల్లో చురుకుగా ఉండే అవకాశం ఉంది. సహజంగానే సిద్ధరామయ్య మొదటి ప్రాధాన్యత  తన సొంత రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడమే.

సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బహిరంగంగా స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ లోలోపల వారు  తీవ్ర  ప్రత్యర్థులుగా ఉన్నారు.  సిద్ధరామయ్య  కర్నాటక  కాంగ్రెస్  రాజకీయాల్లో  సమస్యలు సృష్టించడం ప్రారంభిస్తే హైకమాండ్‌కు ఆయనను నియంత్రించడం కష్టమవుతుంది.

సిద్ధరామయ్యను తొలగించడాన్ని చూస్తుంటే, వివాదాస్పద బ్రిటిష్ రాజకీయవేత్త ఈనోక్ పావెల్ చేసిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుకు వస్తుంది. ‘రాజకీయ జీవితాలు ఏదో ఒక శుభ తరుణంలో మధ్యలోనే ముగిసిపోతే తప్ప, ఎక్కువగా  వైఫల్యంతోనే అంతమవుతాయి. ఎందుకంటే అదే రాజకీయ, మానవ వ్యవహారాల స్వభావం.’ ఒక రాజకీయ నాయకుడు పదవిలో ఉండగా మరణించినా లేదా అధికార శిఖరాగ్రంలో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ఉన్నత పదవిని విడిచిపెట్టినా, ఆ కథను తరచుగా భిన్నంగా గుర్తుంచుకుంటారు.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డా. పెంటపాటి పుల్లారావు పొలిటికల్ ​ఎనలిస్ట్