న్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడున్న దశలో ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వడం కుదరదని గురువారం స్పష్టం చేసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ పరిస్థితిలో స్టే విధిస్తే తీవ్ర గందరగోళం నెలకొంటుందని అభిప్రాయపడింది. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన ప్యానెల్ ద్వారా ఎంపికైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎటువంటి ఆరోపణలు లేవని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. వీరి నియామకం పై స్టే విధించాలని దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈసీ నియామకాల కోసం కేంద్రం తెచ్చిన చట్టాన్ని తప్పు అని భావించలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.
