పారిశుధ్యం.. అంటరాని సమస్యా?

పారిశుధ్యం.. అంటరాని సమస్యా?

ఎడతెరిపి లేని వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షాలు తగ్గిన వెంటనే చెత్త, వ్యర్థాలు, వరదల ద్వారా వచ్చిన మట్టి రోడ్లపై పేరుకుంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. రోడ్లు, వీధులను శుభ్రం చేసే కార్మికులు సమ్మెలో ఉన్నారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగానే చీపుర్లు, పారలు పట్టుకొని రోడ్ల మీదికి వచ్చే కార్మికులు ఇపుడు లేరు. సూర్యుడు ఉదయించే సమయానికల్లా రోడ్లు, వీధులన్నీ శుభ్రంగా ఊడ్చి అద్దంలా తయారు చేసే పారిశుధ్య కార్మికులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని రోడ్లెక్కారు. ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించినా, అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిచినా, అమరవీరుల స్థూపం ఓపెనింగ్ చేసినా రాత్రింబవళ్లు కష్టపడి ముస్తాబు చేసింది ఈ కార్మికులే. గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరొచ్చినా రోడ్లన్నీ ఊడ్చి ముగ్గు పోసి ముస్తాబు చేసేది కూడా ఈ కార్మికులే. కానీ తమ సమస్యలు తీర్చాలని రోడ్ల మీదికి వస్తే మాత్రం వాళ్ల గురించి మాట్లాడే నాథుడే లేడు. ఈ కార్మికులపై ఎందుకింత వివక్ష? గ్రామ పంచాయితీ సిబ్బంది, కార్మికుల్లో మెజార్టీ అట్టడుగు, దళిత వర్గాలే కదా? అందుకే వారిపై ఈ చిన్న చూపా?

నాటి మాటలు గుర్తుచేసే వారేరి?

తెలంగాణ ఏర్పడక ముందు 2013లో జీహెచ్ఎంసీ కార్మికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి, ఔట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి ఉంటడా? కార్మికులు మాత్రం ఎందుకుండాలె అని, కాంట్రాక్ట్ పద్ధతి ఉండదని ప్రగల్భాలు పలికారు. ఇపుడు ఆ వ్యాఖ్యలు గుర్తు చేసే ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ అసెంబ్లీలో ఉన్నారా? కనీసం ప్రతిపక్ష నాయకులు కూడా సమ్మె చేస్తున్న శిబిరాలను సందర్శించడంలేదెందుకు? గ్రామపంచాయితీ సిబ్బంది, కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ఎవరూ ఇవ్వరా? మీడియాలో కవరేజీ ఏది? పారిశుద్ధ్య సమస్య అంటరానిదనా? లేక ఆ పని చేసే వారు అట్టడుగువర్గాల వారనా? రోడ్లు ఊడ్చడం, కాలువలు శుభ్రం చేయడం, చెత్త ఏరివేయడం వంటి పనులకు అదనంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం వంటి పనులతో కార్మికులపై తలకు మించిన భారం వేస్తూ.. చాకిరీ చేయించుకుంటూ.. సమస్యలు పరిష్కరించమంటే ముందూ వెనకా ఆలోచిస్తున్నారెందుకు? పైగా యాంత్రీకరణ పేరుతో ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు, ప్రమాదవశాత్తు చనిపోతే, అదే చీపురు, పార పిల్లలకు అప్పజెప్పడం తప్ప భీమా సౌకర్యం లేదు. అనారోగ్యం బారిన పడి దవాఖానకు పోతే హెల్త్ కార్డులు లేవు, వారిని ముట్టుకునే డాక్టర్ కూడా ఉండడు. కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని కాపాడిందే ఈ కార్మికులు. కానీ రాష్ట్ర ప్రజలు కూడా వీరి కష్టాలను గురించి ఒక్కసారి కూడా ఆలోచించడంలేదు. ప్రభుత్వం నుంచి వీరికి లభించిన ప్రోత్సాహం కూడా ఏం లేదు. ప్రతి నెలా వారికి ఇచ్చే రూ.8500 జీతం కూడా సమయానికి ఇవ్వడం లేదు. కొత్తగా జీవో నెంబర్ 51 తీసుకువచ్చి మల్టీపర్పస్ వర్కర్స్ పేరుతో నలుగురు చేసే పనిని ఇద్దరితో  చేయిస్తున్నది ప్రభుత్వం. 

ఏండ్ల తరబడి కష్టాలే..

పారిశుధ్య కార్మికుల్లో చాలా మంది ఏండ్లతరబడి పని చేస్తున్నారు.  దుమ్ము, చెత్త వాసనలు తట్టుకోలేక అం దరికంటే ముందే అనారోగ్యానికి గురవుతున్నారు. ఎండనకా, వాననకా, చలనకా నిద్రను చంపుకొని పని చేసినా వీరి గురించి ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. కానీ  గ్రామాలకు స్వచ్ఛ అవార్డులు, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వస్తే మాత్రం కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నది. పారిశుద్ధ్య కార్మికులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎందుకు ఆ గౌరవం ఇవ్వదు, ఎందుకు ఒక కార్మికుడు చనిపోతే గ్రామ పంచాయతీ ఇచ్చే ఐదు వేల రూపాయల సాయం కోసం వేచి చూడాలి. ఏళ్ల తరబడి పనిచేసినా ప్రభుత్వం వీరిని ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు? రెగ్యులరైజ్ చేస్తే, ఎక్కువ జీతాలు ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిస్తే, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడుతారు, కానీ కేవలం దళిత వర్గాలే ఈ పని చేయాలనే మనువాద ఆలోచన పాలకుల మెదళ్లలో ఉన్నట్లుగా అనుమానం కలుగుతున్నది. ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే భ్రమతో చీపురునిచ్చి రోడ్లమీదకు పంపే దుర్మార్గ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది. దీని వెనుక పారిశుద్ధ్య కార్మికులు అలాంటి పనులు చేస్తూనే బతకాలి, అభివృద్ధి చెందకూడదనే దుర్మార్గమైన ఆలోచన ఉండి ఉంటుంది. 

పేదల రాజ్యం రావాలి..

గ్రామ పంచాయతీ సిబ్బంది గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నది వారికి ఫాంహౌస్ లు కావాలని కాదు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కావాలని కాదు, ఇరవై లక్షల విలువైన గడియారం కావాలని కాదు..  కేవలం వారు చేస్తున్న పనికి తగిన వేతనం అడుగుతున్నారు. అర్హత ప్రకారం పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ, ఆరోగ్య, బీమా భద్రత కల్పించమంటున్నారు. వారు చేస్తున్న పనిని, వారిని గౌరవప్రదంగా చూడాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం పని చేస్తున్నట్లే, వారు ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపును ఇవ్వమంటున్నారు. కానీ ప్రభుత్వం వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఈ ఆధిపత్య వర్గాల పాలకులు అట్టడుగు వర్గాలకు లాభం చేకూరే చట్టాలను, విధివిధానాలను అమలు చేయరు. ఆ వర్గాలను కూలీలుగానే, బానిసలుగానే ఉంచాలని చూస్తారు. అందుకే మన సమస్యలు తీరాలంటే, మనకు న్యాయం జరగాలంటే, అర్హత కలిగిన కార్మికులు మున్సిపాలిటీ కమిషనర్లు కావాలంటే, చెత్త సేకరించే యంత్రాలు, చెత్త సరఫరా చేసే లారీలు, మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు మనకే దక్కాలంటే మన పేదల రాజ్యం రావాలి. పేదలే పాలకులుగా మారే బహుజన రాజ్యం రావాలి.

– దూడపాక నరేష్,ఉస్మానియా యూనివర్సిటీ