ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనల నేపథ్యంలో జులై నుంచి బంగ్లాదేశ్ ఆగమాగమైంది. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్ లో తలదాచుకుంటున్న పరిస్థితులొచ్చాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశం బాట పట్టారు. జులైలో బంగ్లాదేశ్లో గొడవలు మొదలైన తర్వాత 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు మన దేశానికి తిరిగొచ్చేశారు.
బంగ్లాదేశ్ లో మొత్తం 19 వేలకు పైగా భారతీయులుండగా.. అందులో 9 వేలకు మందికి పైగా విద్యార్థులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ వెళ్లి చదువుకునేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు..? బంగ్లాదేశ్లో నాణ్యమైన విద్య చౌకగా దొరుకుతుందా..? భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసించడం కోసం బంగ్లాదేశ్ వైపు ఎందుకు చూస్తుంటారు..? బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇన్నాళ్లూ భారతీయ విద్యార్థుల ఛాయిస్ బంగ్లాదేశ్ ఎందుకయిందో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్కు భారత్ నుంచి ఎక్కువ మంది వైద్య విద్యార్థులు మెడిసిన్ చదువుకునేందుకు వెళుతుంటారు. బంగ్లాదేశ్లో దాదాపు 25 శాతం మెడికల్ సీట్లు నాన్- నేటివ్ స్టూడెంట్స్కు కేటాయించడమే ఇందుకు కారణం. భారత్లో ఉన్న మెడికల్ కాలేజీలతో పోల్చితే బంగ్లాదేశ్ మెడికల్ కాలేజీలు తక్కువ ఖర్చుకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. భారత్లో మెడిసిన్ పూర్తి చేసే ఖర్చుతో పోల్చుకుంటే బంగ్లాదేశ్లో వైద్య విద్యను తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చనే ప్రధాన కారణంతో భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ వెళుతున్నారు.
భారత్లో వైద్య విద్య చదవాలంటే కనిష్టంగా 5 లక్షల నుంచి గరిష్టంగా 50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ప్రైవేట్ కాలేజీలైతే కోట్లలో వసూలు చేస్తాయి. అదే బంగ్లాదేశ్లో అయితే పాతిక లక్షలకే మెడిసిన్ చదువు పూర్తి చేసుకునే పరిస్థితి ఉంది. పైగా బంగ్లాదేశ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. ఇలా పలు కారణాలతో వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ను బెస్ట్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు.
