- అందుకే సైడ్ జాబ్స్ చేస్తున్న జెన్జెడ్స్
- వర్క్‌ఫ్రం హోం అంటేనే ఇష్టం
- వెల్లడించిన డెలాయిట్ సర్వే
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఖర్చులతో జెనరేషన్ జెడ్ సతమతమవుతోంది.ప్రస్తుతం చేస్తున్న జాబ్‌తో పాటు మరో జాబ్ చేయకతప్పని పరిస్థితి నెలకొంది. మరికొందరు జాబ్స్ లేక అష్టకష్టాల పాలవుతున్నారు. 1990ల చివరి నుండి 2010 ప్రారంభంలో జన్మించిన వారిని జెన్ జెడ్‌లు అని అంటారు. 1980లు లేదా 1990లలో పుట్టిన వారిని మిలీయల్స్ అంటారు. డెలాయిట్ నిర్వహించిన మిలీనియల్ సర్వే ప్రకారం... ఇందులో పాల్గొన్న వారిలో సగం మంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నామని అన్నారు. నిరుద్యోగం కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. ఖర్చులను తట్టుకోలేక పార్ట్‌టైమ్ జాబ్ చేయాల్సి వస్తోందని 37 శాతం మంది చెప్పారు. ఖర్చులు పెరగడం వల్ల.. ఇల్లు కొనడం, పెళ్లి చేసుకోవడం, కారు కొనడం వంటివి వాయిదా వేసుకుంటున్నామని చెప్పారు. కొంతమంది కొత్త వాటికి బదులు పాత కారు, పాత ఇల్లుతో సరిపెట్టుకున్నామని అన్నారు. డెలాయిట్ గ్లోబల్ 2023 'జెన్‌జెడ్ మిలీనియల్ సర్వే' కోసం 22,856 మంది నుంచి వివరాలు తీసుకుంది. వీరిలో 14,483 జనరేషన్ జెడ్‌లు కాగా 8,373 మంది మిలీనియల్స్ ఉన్నారు. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, పశ్చిమ ఐరోపా, తూర్పు యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్‌లో ఈ సర్వే జరిగింది. భారతదేశం నుండి 800 మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
పనికి గుర్తింపు కావాలి..
జెన్‌జెడ్‌లలో 49 శాతం, మిలీనియల్స్‌లో 62 శాతం మంది తమ పనికి గుర్తింపు ముఖ్యమని, పని–-జీవితం బ్యాలెన్స్ ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా పనిలో చేరేటప్పుడు ఈ రెండింటినీ చూస్తామని అన్నారు. కెరీర్ గ్రోత్‌కు అవకాశం ఉన్న పార్ట్‌టైమ్ జాబ్స్నే ఇష్టపడతామని,పనిలో ‘ఫ్లెక్సిబిలిటీ’ కూడా ముఖ్యమేనని చెప్పారు. రిమోట్ విధానాలు ఉన్న కంపెనీలనే ఎంచుకుంటామని, ఆఫీసుకు రావాలని యజమాని బలవంతం చేస్తే ఉద్యోగమే మానేస్తామని, పనిచేస్తున్నప్పుడు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నామని 46 శాతం మంది అన్నారు.
