దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..ఎందుకింత వేడి అంటే.?

దేశవ్యాప్తంగా రికార్డ్  స్థాయిలో ఉష్ణోగ్రతలు..ఎందుకింత వేడి అంటే.?

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈసారి వేసవి భీకర ప్రతాపం చూపుతోంది. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలాంటి పలు రాష్ట్రాలు తీవ్రమైన వడగాడ్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. యూపీలోని బాందా జిల్లాలో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ ల వరకూ టెంపరేచర్ రికార్డ్ అయింది. పొద్దున పది దాటితే ఎవరూ బయటకు రాకపోవడంతో బాందా సిటీ పగలంతా  దాదాపు షట్ డౌన్ అయినట్టు కనిపిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ 45 నుంచి 48 డిగ్రీలలోపు టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆయా ప్రాంతాలకు వరుసగా హీట్‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌, సివియర్‌‌‌‌‌‌‌‌ హీట్‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌ అలర్ట్‌‌‌‌‌‌‌‌లను జారీ చేస్తోంది.

ఎందుకింత వేడి..?

క్లైమేట్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌ ప్రభావం: భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుండటం వల్ల హీట్‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌లు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడిగాలులు సాధారణమై పోతున్నాయని హెచ్చరిస్తున్నారు. 

ఎల్‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్: పసిఫిక్‌‌‌‌‌‌‌‌ సముద్రంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. భారత్‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రభావం వేసవి తీవ్రతను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. 

వర్షాల కొరత: ప్రీ-మాన్సూన్‌‌‌‌‌‌‌‌ వర్షాలు తక్కువగా పడటం వల్ల భూమి చల్లబడే అవకాశం తగ్గిపోయింది. పొడి గాలులు, తక్కువ తేమ ఈ తీవ్ర వేడికి కారణమవుతున్నాయి. 

అర్బనైజేషన్ ప్రభావం: కాంక్రీట్‌‌‌‌‌‌‌‌ భవనాలు, వాహనాలు పెరగడం, చెట్లు తగ్గిపోతుండటం నగరాల్లో ‘హీట్‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌’ను పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. 

పర్యావరణ విధ్వంసం: ఒకప్పుడు వాతావరణాన్ని సమతూకంలో ఉంచిన సహజ వనరులన్నీ నశించిపోవడమే వేడి తీవ్రతకు కారణం. అక్రమ మైనింగ్, నదుల్లో ఇసుక దోపిడీ ప్రభావితం చేస్తున్నాయి.

చెట్ల నరికివేత: అడవులు, చెట్ల నరికివేత వల్ల కూడా వాతావరణం వేడెక్కుతోంది. ప్రధానంగా, నగరాలు, పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం వల్లే వేడి తీవ్రత పెరుగుతోందని చెప్తున్నారు.